Cable Bridge in Khammam Munneru: ఖమ్మం మున్నేరుపై దుర్గం చెరువు తరహా బ్రిడ్జి
Cable Bridge in Khammam Munneru: హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకంగా ఆకర్షిస్తున్నది. ఈ కేబుల్ బ్రిడ్జిని తిలకించేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఫలితంగా దుర్గం చెరువు పర్యాటక ప్రాంతంగా మార్పు చెందింది. ఇదే తరహాలో ఖమ్మంలోని మున్నేరును కూడా అభివృద్ధి చేయనున్నారు. మున్నేరుపై కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా, హామీ ఇచ్చిన వెంటనే బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన రూ. 180 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హామీ ఇచ్చిన వెంటనే బ్రిడ్జి ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడంపై మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్నేరులో 420 మీటర్ల పొడవైన బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 300 మీటర్ల మేర తీగలతో కూడిన వంతెన ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే మున్నేరు కూడా దుర్గం చెరువు, లక్నవరం మాదిరిగా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఖమ్మం నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.