Jubilee Bus Station : హైదరాబాద్ నడిబొడ్డున తగలబడిన బస్సు
Bus catches fire at Jubilee Bus Station : నగరం నడిబొడ్డున బస్సు తగలబడడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే… జూబ్లీ బస్ స్టేషన్ ప్లాట్ ఫాం నెం.11లో ఆగి ఉన్న టీఎస్ఆర్టీసీ బస్సులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో జేబిఎస్ – జనగాం టౌన్ మధ్య నడుస్తున్న జనగాం డిపోకు చెందిన బస్సు ఏ ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్, టిక్కెట్ కలెక్టర్‌తో పాటు ప్రయాణికులంతా దిగి, అల్పాహారం తీసుకోవడానికి వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆర్టీసీ సిబ్బంది అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో తాము ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడం చూసి భయాందోళనకు గురయ్యారు. “ఇంజిన్‌కు సమీపంలో ఉన్న వైర్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నాము” అని ఒక అధికారి తెలిపారు. కాగా ఈ కేసును మారేడ్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.