BRS Party Public Meeting in Khammam: నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ…
BRS Party Public Meeting in Khammam: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందిన తరువాత తొలి బహిరంగ సభ నేడు ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని 100 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ సభకు సీఎం కేసీఆర్ తో పాటు ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవత్ మాన్, పినరయి విజయన్ లు హాజరుకానున్నారు.
నలుగురు ముఖ్యమంత్రులు యాదాద్రిలోని శ్రీ లక్ష్మనరసింహ స్వామివారిని దర్శించుకొని అక్కడి నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఖమ్మంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని, కంటివెలుగు 2 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సభకు తరలివెళ్లనున్నారు. ఈ సమావేశం ద్వారా తన బలాన్ని నిరూపించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సభలు సమావేశాలను ఏర్పాటు చేసి 2024 లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టనున్నారు. తొలుత ఆవిర్భావ సభను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ, తొలి సభను ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నారు.