BRS Operation Khammam: ఖమ్మంపై బీఆర్ఎస్ గురి…
BRS Eyes on Khammam: బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తరువాత సీఎం కేసీఆర్ తొలి సభను ఢిల్లీని కాదని ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఈనెల 18 వ తేదీన తొలి ఆవిర్భావ సభ జరగనున్నది. హడావుడిగా ఖమ్మంలో ఈ సభను ఏర్పాటు చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు పట్టున్నప్పటికీ, ఆ పార్టీకి చెందిన బలమైన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమౌతున్నారు. మరో కీలక నేత తుమ్మల కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్దమౌతున్నారు. అయితే, తుమ్మల ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు.
పొంగులేటితో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం ఉండటంతో హడావుడిగా కేసీఆర్ ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమీకరణాలు మారిపోతుండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా, ఇటీవలే చంద్రబాబు నాయుడు ఖమ్మంలో నిర్వహించిన సభ భారీ సక్సెస్ అయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ యాక్టీవ్ కాబోతున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ యాక్టీవ్ అయితే అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అవరోధంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఖమ్మం గుమ్మంలోనే చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా ఆ జిల్లాలో తమకే పూర్తి పట్టుందని స్పష్టం చేయబోతునన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.