BRS In AP: ఏపీలో అడుగుపెట్టేముందు కేసీఆర్ ఆలోచించుకోవాల్సిందే
BRS in Andhra Pradesh: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తరువాత ఏపీలో విస్తరింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో తనకు మంచి ఫాలోయింగ్ ఉందని పలుమార్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తరువాత ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఇక ఏపీ నుండి కొందరు నేతలు ఇప్పటికే బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ముందు సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి చేసిన అన్యాయం గురించి అక్కడి ప్రజలు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోవడానికి ప్రధాన కారణం కేసీఆరే అని ఏపీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
కేసీఆర్ ఉద్యమం చేయబట్టే రెండు రాష్ట్రాలుగా విడిపోవలసి వచ్చింది. ఇక, తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఏపీపై అనేక సందర్భాల్లో విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలపై నోరుపారేసుకున్నారు. వీటిని ప్రజలు మర్చిపోతారని అనుకుంటే పొరపాటే. అంతేకాకుండా, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అనేక కార్పోరేషన్లు, ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన విభజన పూర్తికాకుండా సీఎం కేసీఆర్ పదేపదే అడ్డుకుంటున్నారన్నది ప్రధాన వాదన. ఉమ్మడి ఆస్తుల విలువ సుమారు 1.50 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ నిధులు ఏపీకి చాలా అవసరం.
ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో కేసీఆర్ మోకాళ్లడ్డేస్తున్నారు. అంతేకాకుండా, కృష్ణాజలాల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. కృష్ణా బ్యారేజీపై తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులు అక్రమంగా పరిమితికి మించి నీళ్లు వాడుకుంటూ కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఫలితంగా ఏపీకి అవసరమైన నీరు అందడం లేదు. అంతేకాదు, ఏపీకి విద్యుత్ బకాయిల కింద రూ. 6 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా వివిధ కారణాలు చూపుతూ చెల్లించడం లేదు. దీనిపై కూడా ఏపీ ప్రజలు గుర్రున ఉన్నారు. ఈరోజు ఏపీలో ఈ పరిస్థితులు కలగడానికి కారణం కేసీఆర్ అని, విడిపోయినప్పటికీ ఏపీకి రావాల్సిన నిధులను, ఆస్తులను సరైన సమయంలో పంపకాలు చేసినట్లేతే పరిస్థితుల్లో కొంతమేర మార్పు ఉండేదని ఏపీ నేతలు చెబుతున్నారు.
ఏపీ నుండి బీఆర్ఎస్ లో చేరేందుకు అనేకమంది నేతలు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవి కేవలం అపోహలే అని, ఒకవేళ నేతలు చేరినంత మాత్రానా పొంగిపోవాల్సిన అవసరం లేదని, ప్రజలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తమకు నష్టం కలిగించినవాడిగానే చూస్తున్నారని ఏపీ నేతలు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా, ఫైనల్‌గా ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి ఓటు వేయాలి, ఎవర్ని గెలిపించాలని నిర్ణయించేది ఓటర్లే. మరి ఓటర్ల మనసులో ఏమున్నదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏపీకి చెందిన హైదరాబాద్‌లో స్థిరపడిన నేతలు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరుతున్నారని, వారి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదని, ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి కొంతమంది నేతలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టలో చేరుతున్నారని, ఏపీలో రాణించడం అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.