BRS Meeting: ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ…
BRS Public Meeting in Khammam: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తరువాత బహిరంగ సభలను ఏర్పాటు చేయలేదు. తొలి సభను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, ఆవిర్భావం తరువాత తొలి సభను ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొలిసభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 18 వ తేదీన తొలి సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభద్వారా బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తొలి బహిరంగ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, జాతీయస్థాయి నేతలను, మాజీ ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఈ సభద్వారానే బీఆర్ఎస్ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయనున్నారు.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ఈ సభను తొలి అడుగుగా మలుచుకోనున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార్పు చెందిన తరువాత జరుగుతున్న తొలి సభ కావడంతో విజయవంతం చేసేందుకు నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఇక ఇదే రోజున సీఎం కేసీఆర్ ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం తరువాత సభను నిర్వహించనున్నారు. ఇక, జనవరి 12వ తేదీన మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.