Bonalu: ఐటీ కారిడార్‌లో బోనాల వేడుకలు
Bonalu celebrations in IT corridor: తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచేది బోనాల పండుగ. ఊరూరా అన్నివర్గాల వారు భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటారు. ప్రతి ఏడాది ఆషాఢమాసం మొదట్లో ప్రారంభమై నెలాఖరు వరకు బోనాలు కొనసాగుతాయి. ధనిక పేద అనే బేధం లేకుండా అందరు ఈ బోనాల పండగను జరుపుకుంటారు. గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. కొత్త కుండలో వండిన బోనం సమర్పించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ బోనాలను మహిళలు నెత్తి ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనాల ఉత్సవం ఐటీ కారిడార్ లో ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ఐటీ కారిడార్‌లో బోనాలు వేడుకలు ఇన్నోవేషన్ సెంటర్ టి-హబ్ 2.0లో ఘనంగా జరిగాయి. తొట్టలు, బోనాలు, పోతరాజుల నృత్యాలతో ఐటీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. అనేక మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిష్కరణలు, పెట్టుబడులకు కేంద్రంగా నిలవాలని ఆకాంక్షిస్తూ టిటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల 21 బోనాలు సమర్పించారు. రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తెలంగాణ అభివృద్ధి కోసం 2013 నుంచి టీటా ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించడం సంతోషకరమని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు పేర్కొన్నారు.
గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్‌దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం`మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది.