BJP Strategy on Telangana: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్… ఆరుగురు సభ్యులతో
BJP Strategy on Telangana: తెలంగాణపై బీజేపీ ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని కాషాయం పార్టీ చూస్తున్నది. 2014 వరకు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విడిపోయిన తరువాత బలహీనపడింది. పార్టీ దూకుడు మీదున్నా, పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడంతో బలహీనపడింది. దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నది.
ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానం తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలుమార్లు జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించారు. సభలు సమావేశాలను నిర్వహించారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల వరకు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నాయకులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా వ్యూహరచన చేస్తున్నారు. దీనితో పాటుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజాపోరాటాలు చేయాలని అధిష్టానం ఆదేశించింది.
ఇక, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీలుగా ఉన్న తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్‌లు రాష్ట్రంలో విరివిగా పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తున్నారు. వీరిద్దిరితో పాటు మరో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయడం వంటివి చేయడంపై దృష్టి సారించనున్నారు. బూత్ స్థాయిలో బలోపేతమైతే తప్పకుండా పార్టీ విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు.
ఈ ఏడాది జరిగే రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గుర్తించిన 160 లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీని విస్తరించేందుకు, నిర్దేశిత కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. అయితే, ప్రధానంగా ఈ కమిటీ దృష్టి తెలంగాణపైనే ఫొకస్ చేసింది.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అమిత్ షా భాగ్యనగరంలో ఉండనున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు బెంగళూరులోనూ, తెలంగాణ ఎన్నికలు ముగిసే వరకు భాగ్యనగరంలోనూ ఉండనున్నారు. కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు, తెలంగాణలో అదికారంలోకి రావాలని పార్టీ నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తరచుగా తెలంగాణ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరం అనుకుంటే ప్రధాని మోడీ కూడా సభలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది 9, వచ్చే ఏడాది 8 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 2024లో పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టొచ్చని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇక, తాజా సర్వేల ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ స్థాయిలో బీజేపీ 6 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.