తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతున్నది. అయితే, కర్ణాటకలో అధికాంలో ఉన్న పార్టీ ఓటమిపాలవ్వడంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించింది. చేసిన అభివృద్ధితోనే ప్రజల ముందుకు వెళ్లాలని కాషాయం నేతలు భావిస్తున్నారు.
Telangana BJP Meeting: తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతున్నది. అయితే, కర్ణాటకలో అధికాంలో ఉన్న పార్టీ ఓటమిపాలవ్వడంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించింది. చేసిన అభివృద్ధితోనే ప్రజల ముందుకు వెళ్లాలని కాషాయం నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఆ పార్టీ ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. మూడు దశాబ్దాలుగా పార్టీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నది. కాగా, ఇప్పుడు ఆ అవకాశాలకు మార్గం సుగమం అవుతుండటంతో పార్టీలో పొరపొచ్చాలు లేకుండా, లుకలుకలు రాకుండా చూసుకోని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం చంపాపేటలోని పార్టీ కార్యాలయంలో జరగనున్నది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్లమెంట్ బోర్డ్ సభ్యలు లక్ష్మణ్, పార్టీ ఇన్‌చార్జ్‌లు శివప్రకాష్, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో పార్టీ కీలక అంశాలపై చర్చించబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా దేశంలో గత తొమ్మిదేళ్లుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటుగా, కేంద్రం చేసిన అభివృద్దిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలపైనా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నారు.