Telangana BJP: తెలంగాణ బీజేపీలో వర్గ పోరు రోజురోజుకీ పెరుగుతోంది. బండి వర్సస్ ఈటల అన్నట్లుగా వర్గ పోరు కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాగైనా గెలుస్తామని బీజేపీ నాయకత్వం చెబుతున్న వేళ ఈ ఆధిపత్య పోరు సమస్యగా మారుతోంది. బండి సంజయ్ కు అధ్యక్షుడిగా పదవీ కాలం రెన్యువల్ చేయవద్దంటూ ఢిల్లీలో లాబీయింగ్ ముమ్మరమైంది. బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్రలో సహాయ మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ బండికి సారధి ఎవరు.
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ లక్ష్యంగా ఫిర్యాదులు..నివేదికలు అందుతున్నాయి. బండి సంజయ్ తెలంగాణ చీఫ్ గా నియమితులైన తరువాత పార్టీలో జోష్ వచ్చిందని చెబుతున్న నేతలే ఇప్పుడు బండి సంజయ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే గెలవలేమంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, మురళీధరన్, బీఎల్ సంతోష్ వంటి నేతల నుంచి పార్టీ నాయకత్వం నివేదికలు కోరింది. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు బీజేపీ తెలంగాణ లో ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
పార్టీలో చేరికలు..సభలు..పార్టీ కార్యక్రమాల్లోనూ బీజేపీ నేతలు వెనుకబడి ఉన్నారంటూ పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. పార్టీలో చేరికలు పెరగాలంటే ముందుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందంటూ పార్టీ నాయకత్వానికి తెలంగాణ నేతలు తేల్చి చెప్పారు, బండి సంజయ్ కేవలం హిందుత్వ అజెండా మినహా ఇతర అంశాల పైన ఎక్కడా ప్రస్తావన చేయటం లేదని రిపోర్టు ఇచ్చారు. పాలనా పరమైన వైఫల్యాల ను ఎండగట్టటంలో బండి వెనుకబడ్డారని చెబుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు బీజేపీలో ప్రాధాన్యత లభించటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు వీరంతా పార్టీలో తాము కొనసాగాలంటే తమకు ప్రాధాన్యత దక్కేలా నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలకు తిరిగి రావాలంటూ పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి వంటి నేతలతో బీజేపీ నేతలు చర్చలు చేసినా వారిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. బీజేపీలోకి వచ్చిన నేతలు తిరిగి పార్టీ వీడకుండా ఉండాలంటే వెంటనే ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ తెర పైకి వస్తోంది. ఈ డిమాండ్ ను కొందరు నేతలు నేరుగా పార్టీ అధినాయకత్వం వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బండి సంజయ్ కు ప్రాధాన్యత తగ్గకుండా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సహాయ మంత్రి హోదా ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ నడుస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ ఈ సమయంలో ఢిల్లీ వెళ్లారు.
ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షడు మారకపోవచ్చని విశ్లేషకుల అంచనా. బండి సంజయ్ హయాంలోనే తెలంగాణలో పార్టీ గతంలో కంటే వేగంగా పుంజుకుందనే వాదన ఉంది. హిందుత్వ ఎంజెండాను ముందుకు తీసుకుపోవడంతో ఆయన సఫలీకృతుడయ్యాడని ఆయన మద్దతు దారులు గుర్తు చేస్తున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 40 మంది వరకూ కౌన్సిలర్లను గెలిపించుకున్నారని పార్టీ నాయకత్వానికి వివరిస్తున్నారు. మోదీ, అమిత్ షాలకు బండి సంజయ్ నాయకత్వంపై మంచి నమ్మకం ఉందని ఆయనను కాదని మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవని అంటున్నారు. ఈ మొత్తం పరిణామలపైన పార్టీ నాయకత్వం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.