బ్యాంక్ ఉగ్యోగి నిర్వాకం : కోటిన్నర గాయబ్.. తీరా చూస్తే!
ఒక బ్యాంకు ఉద్యోగి చేసిన నిర్వాకంతో కోటిన్నర రూపాయలు మాయమయ్యాయి. తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ఆరా తీస్తే కోటిన్నర రూపాయలలో కోటి 40 లక్షల రూపాయలు రికవరీ చేయగలిగారు కానీ మరో పది లక్షలు రికవరీ చేయలేకపోయారు దీంతో ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు సదరు బ్యాంకు అధికారులు. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు అనే పేరుతో ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన దళిత బంధు నిధులు రంగారెడ్డి జిల్లా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని లక్డీకాపూల్ ఎస్బీఐ నుంచి రంగారెడ్డి జిల్లా ఎస్బిఐ కలెక్టరేట్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశారు.
ఈ సమయంలో బ్యాంకులో పనిచేసే క్లర్క్ తప్పిదంతో దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో పడాల్సిన సొమ్ము వేరే వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. ఏప్రిల్ 26వ తేదీన 15 మంది ఖాతాలో 10 లక్షల చొప్పున కోటిన్నర రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది. అయితే అదే బ్యాంకులో ఖాతా దారులుగా ఉన్న లోటస్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాలలో జీతాలకు బదులు ఈ దళిత బంధు నిధులు వేశారు. ఈ విషయం 15 రోజుల వరకు గుర్తించలేకపోయారు అధికారులు. గుర్తించిన తర్వాత సదరు లోటస్ హాస్పిటల్ ఉద్యోగుల దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే అందులో 14 మంది దగ్గర డబ్బులు ఉండి వెనక్కి ఇచ్చేశారు. ఒక వ్యక్తి మాత్రం నేను ఖర్చు పెట్టేశాను ఏం చేసుకుంటారో చేసుకోమని చేతులెత్తేయడంతో బ్యాంకు మేనేజర్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.