Bandi Sanjay Protest: నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు దీక్ష…హామీలు అమలు చేయాలని డిమాండ్
Bandi Sanjay Protest today: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరసన దీక్షను చేపట్టనున్నారు. రాష్ట్రంలో మహిళల హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో పాటు మహిళలపై అత్యాచారాలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు ఒకరోజు దీక్షను చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్యాలయంలో ఒక్కరోజు దీక్షను చేయనున్నారు. ఈరోజు మధ్యహ్నం 12 గంటలకు ఈ నిరసన దీక్ష ప్రారంభం కానున్నది. బండి సంజయ్‌తో పాటు ఈ దీక్షలో మహిళా మోర్చా నేతలు కూడా పాల్గొననున్నారు. దీక్షను ప్రారంభించడానికి ముందురోజైన ఆదివారంనాడు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖను రాశారు.
కేసీఆర్ పరిపాలనతో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, సామాన్యులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. సమస్యలు ఏవీ కూడా పరిష్కారం కావడం లేదని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జులై 1 నుండి పీఆర్సీని అమలు చేసితీరాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 9 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీపై చర్చించి కొత్త పీఆర్సీని అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టబోతున్న తరుణంలో పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.