Bandi Sanjay: రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై 6 లక్షల అప్పు ఉంది – బండి సంజయ్
Bandi Sanjay fires on CM KCR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, సచివాలయ నిర్మాణం, పోలీసు వ్యవస్థ తదితర అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం కేసీఆర్ సౌలభ్యం కోసమే సచివాలయ నిర్మాణం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ఎలా ప్రారంభిస్తారని బండి సంజయ్ నిలదీశారు. అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయం ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని బండి సంజయ్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి 6 లక్షల రూపాయల అప్పు మిగిలిందని బండి సంజయ్ తెలిపారు. బీజీపీ డిమాండ్ చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇచ్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. అప్పుల మీద అప్పులు చేసిన ముఖ్యమంత్రికి ఇక నుంచి ఎవరూ అప్పు ఇవ్వరని, అప్పు ఇచ్చే పరిస్థితి లేదని బండి సంజయ్ అన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపైనా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కలెక్టర్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు నాశనం అయ్యాయని మండి పడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీచర్లకు ఇబ్బంది కరంగా మారిన జీవో 317 విషయంలోను ప్రభుత్వం వైఖరిని బండి సంజయ్ తప్పుబట్టారు. జనవరి 30లోగా జీవోను సవరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని కేసీఆర్ ను హెచ్చరించారు.
బీజేపీ నాయకులు సొంత మైలేజీ కోసం పనిచేయవద్దని సూచించారు. సొంత ఎజెండా కోసం పనిచేసేవాళ్లు బీజేపీ నాయకులే కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేవారే అసలైన నాయకులని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ రాక ముందు ఏటా మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.10వేల కోట్లు, నేడు రూ.40 వేల కోట్లు దాటింది. మద్యం ద్వారా ఒక్కో కుటుంబం నుండి సగటున ఏటా రూ.50 వేల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. కానీ ప్రతి కుటుంబానికి మిగిలింది రూ.6 లక్షల అప్పు.
– రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీ @bandisanjay_bjp pic.twitter.com/ECsoYdYpal— BJP Telangana (@BJP4Telangana) January 24, 2023