Bandi Sanjay: నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది- బండి సంజయ్
Bandi Sanjay comments on Nagoba Jatara
తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన అని బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారని, ద్రౌపది ముర్మును బలపరచడం మాని, యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుచేశారు. పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు.
ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాని, నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తామని, రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని బండి సంజయ్ హామీలు గుప్పించారు.
అంగరంగ వైభవం నాగోబా జాతర
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపుర్ గ్రామంలో నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివాసీలలో గోండు తెగ వారు 10 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు ఇక్కడకు తరలి వస్తారు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర ప్రాంతంలోని కొన్ని ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా నాగోబా జాతరలో పాల్గొంటారు.