Bandi Sanjay: జీఓ 317కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం- బండి సంజయ్
Bandi Sanjay comments on GO 317
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. 317 జీఓ అనాలోచితం, అశాస్త్రీయం అని అన్నారు. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన జీఓ 317 అని బండి సంజయ్ ఆరోపించారు. 13 జిల్లాలలో జీవిత భాగస్వాముల బదిలీలు ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చేయలేదా అంటూ నిలదీశారు. బదిలీలు, ప్రమోషన్లు అయినా సరిగా చేయండని సలహా ఇచ్చారు. ఉద్యోగులకు నాలుగు DA లు ఇవ్వాలని, వారి కోసం జారీ చేసిన హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదని బండి సంజయ్ గుర్తుచేశారు.
ప్రగతి భవన్ నుండి కేసీఆర్ ను గుంజుకొచ్చే రోజులు దగ్గరకు వచ్చాయని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులు, ఉపాద్యాయులు కూడా రోడ్ల పైకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. PRC ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీరు, బిర్యానీ లకు ఆశపడే వారికి కాకుండా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల తో సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని బండి సంజయ్ మండి పడ్డారు. నిసనకు దిగిన ఉపాధ్యాయులను చాలా కర్కషంగా అరెస్టు చేశారని, ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి బీజేపీ సిద్ధమౌతోందని, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయమై చర్చిస్తామని కూడా బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలపై కూడా బండి సంజయ్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గించామని చెబుతున్న పాలకులు, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న హత్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.