Bandi Sanjay: ప్రమాదం జరిగినా రారా? కేసీఆర్, కేటీఆర్ లపై బండి సంజయ్ పైర్
Bandi Sanjay attacks CM KCR and Minister KTR
స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. సీఏం కేసీఆర్ గాని, మంత్రి కేటీఆర్ ప్రమాద స్థలానికి రాకపోవడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే మున్సిపల్ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన , ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా చేయడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. పేద కుటుంబాల పిల్లలు ..పొట్టకూటి కోసం వచ్చి , ప్రాణాలు పోగొట్టుకోవడం బాధ కలిగించిందని బండి సంజయ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై అంశంపై కూడా బండి సంజయ్ ప్రభుత్వంపై పలు ఘాటు విమర్శలు చేశారు. పేపర్ లీకేజీ అంశంలో నిందితురాలుగా ఉన్న రేణుక బీఆర్ఎస్ నేత కూతురేనని బండి సంజయ్ అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అవగానే..బీజేపీనీ బద్నాం చేయాలని చూశారని బండి సంజయ్ మండిపడ్డారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గురించి ఆరా తీయకుండానే…ఎంక్వైరీ చేయకుండానే ఉద్యోగం ఇచ్చావా ? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీదే విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ నేతలచెంప చెళ్లుమనపించాయని అన్నారు. ఇవే కావు, అసెంబ్లీ , పార్లమెంట్ ఏ ఎన్నికలు అయినా..తెలంగాణలో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.