Bandi Sanjay: కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా ఉద్యమిస్తాం – బండి సంజయ్
Bandi Sanjay attack on CM KCR and Minister KTR
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్లు లీక్ వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాట పట్టింది. నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు సిద్ధమయింది. మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షకు దిగనుంది. ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
పరీక్షల రద్దుతో 30 లక్షల మంది నిరుద్యోగులు అల్లాడుతుంటే కేసీఆర్ నోరు మెదపలేదని బండి సంజయ్ మండి పడ్డారు. దళితులకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని …-దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను అప్పులపాల్జేసి చిప్పచేతికిచ్చిన ఘనత కేసీఆర్ దేనని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేదాకా పోరాడదామని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ మోసాలను, కేంద్ర పథకాలను వివరించండని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
విచారణ కొనసాగిస్తున్న సిట్
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్ల లీక్ వ్యవహారాన్ని సిట్ విచారణ కొనసాగిస్తోంది. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అనేక విషయాలను రాబట్టింది. నిందితులను టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి తీసుకువచ్చి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. పేపర్లను ఎలా దింగతనం చేశారనే విషయాన్ని తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని పేపర్లు దొంగలించారని, ఎందరికి అమ్మారనే విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.