Bandi Sanjay: ‘‘ఛలో టీఎస్పీఎస్సీ’’ పిలుపు..బండి సంజయ్ అరెస్ట్!
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ‘‘ఛలో టీఎస్పీఎస్సీ’’ పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళుతున్నట్లు ప్రకటించారు బండి సంజయ్. బండి సంజయ్ ప్రకటనతో ఆయన ఉన్న గన్ పార్క్ ను చుట్టుముట్టిన పోలీసులు, ఆ ఆప్రాంతాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన పోలీసులు, టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ కు రక్షణ కవచంగా కార్యకర్తలు, మహిళలు నిలిచారు. ఒకరకంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో గన్ పార్క్ పరిసర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. వ్యూ వాంట్ జస్టిస్… కేటీఆర్ ను బర్త్ రఫ్ చేయాల్సిందే…. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనంటూ పెద్ద పెట్టున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద బీజేపీ నేతల అరెస్ట్ దృశ్యాలు కెమెరాలో బంధిస్తున్న టీవీ ఛానల్ లైవ్ లను కూడా పోలీసులు కట్ చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కార్ఖానా పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది.