Bala Krishna-Harish Rao: బాలకృష్ణ, హరీష్ రావు పరస్పర ప్రశంసలు
Bala krishna-Harish Rao praise each other: ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరస్పరం ప్రశంసించుకున్నారు. బాలకృష్ణ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 22వ వార్షికోత్సవంలో ఇది చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న బసవతారకం హాస్పిటల్ లో జరిగింది. దీనికి హరీష్ రావు ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాషంటే ఎన్టీఆర్ అని చెప్పారు. ఈ ఆస్పత్రిని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ చేతుల మీదుగా ప్రారంభించామని గుర్తుచేశారు. తన తల్లి బసవతారకం కోరిక మేరకు హాస్పిటల్ స్టార్ట్ చేశామని తెలిపారు. ఆస్పత్రి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా సహకరించిన అందరికీ బాలకృష్ణ వందనాలు చెప్పారు. హరీష్ రావు ప్రజల మనిషని, ఆదర్శవంతమైన నాయకుడని మెచ్చుకున్నారు.
ఆయన్ని ఒక్కసారి వెళ్లి కలిస్తేనే హాస్పిటల్ ట్యాక్స్ రూ.6 కోట్లు మాఫీ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను ట్రీట్ చేస్తున్న ఆస్పత్రుల్లో రెండో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎంతో మంది దాతలు హాస్పిటల్ కి సాయం చేస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ కి, కేసీఆర్ కి మంచి అనుబంధం ఉండేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ బాధితుల కోసం రూ.753 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. బసవతారకం ఆస్పత్రిలో 3 లక్షల మందికి వైద్యం అందించారని, అయినా క్యాన్సర్ పెరుగుతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 75 శాతం మంది ప్రజలు రోగం వస్తే గానీ ఆరోగ్యం గురించి ఆలోచించరని, క్యాన్సర్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాధిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
శరీరంలో క్యాన్సర్ ఉందనే విషయాన్ని గుర్తించడమే చాలా కష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హెల్త్ ప్రొఫైల్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెరుగుతోందని హరీష్ రావు చెప్పారు. కీమోథెరపీ సేవలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో తెస్తున్నామని వెల్లడించారు. ఎంఎన్ జే ఆస్పత్రిని 750 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.
నిమ్స్ లో 8 మందికి, ఎంఎన్ జేలో ఇద్దరికి ప్రతి నెలా ఉచితంగా న్యూరో బోన్ సర్జరీ అందిస్తున్నామని వివరించారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎన్టీఆర్ ప్రారంభించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు. తాను హెల్త్ మినిస్టర్ అయ్యాక బాలకృష్ణ రెండు సార్లు కలిశారని తెలిపారు. ఆయన కరుకుగా కనిపిస్తారు గానీ మనసు మాత్రం వెన్న అని అన్నారు. బయటకు కనిపించే బాలకృష్ణ వేరు, లోపల బాలకృష్ణ వేరు అని హరీష్ రావు ప్రశంసించారు.