కర్నూలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది... అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయచ్చంటూ మొదలైన ఊహాగానాల నడుమ ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ సుప్రీం కోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ ఫిటిషన్ పై విచారణ జరుగుతుంది
YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ లో హై డ్రామా కొనసాగుతోంది. దాదాపు నెల రోజులుగా అవినాశ్ రెడ్డి..సీబీఐ మధ్య దాగుడు మూతల్లా వ్యవహారం మారింది. సీబీఐ తమ పైన వస్తున్న ఒత్తిళ్ల కారణంగా ఒక అడుగు ముందుకు..నాలుగు అడుగులు వెనక్కు వేస్తోందా..లేక తనకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అవినాశ్ సీబీఐకి సినిమా చూపిస్తున్నారా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారుతోంది. కర్నూలు కు హడావుడిగా వెళ్లిన సీబీఐ ఎంపీని అరెస్ట్ చేసేందుకే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అసలు అవినాశ్ కోసమేనా సీబీఐ కర్నూలు వెళ్లింది అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో తెర వెనుక ఏం జరుగుతోంది.
కర్నూలులో హై డ్రామా.. అక్కడే సీబీఐ అధికారులు
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే ఆరు సార్లు విచారించింది. గత వారం రోజుల్లో మూడు సార్లు విచారణకు పిలిచింది. అవినాశ్ హాజరు కాలేదు. ఇప్పుడు తన తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని..తనకు సమయం కావాలని సీబీఐకి లేఖ రాసారు. వెంటనే సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలులో దిగారు. ఇక అవినాశ్ అరెస్ట్ కోసమే సీబీఐ వచ్చిందంటూ ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీతో పలు విడతలు సమావేశమయ్యారు. అవినాశ్ ను లొంగిపోవాలని సూచించాలని కోరారు. పోలీసులు చెబితే అవినాశ్ లొంగిపోతారా..పోలీసులు అలా చెప్పే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ చర్చ. ఆస్పత్రి వైద్యులు అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఈలోగా సీబీఐ కి మరో సారి లేఖ రాశారు అవినాశ్. తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరయ్యేందుకు వారం గడువు కావాలని కోరారు.
మంగళవారం బెయిల్ పిటిషన్ పై విచారణ
అవినాశ్ అరెస్ట్ పై ఊహాగానాలు కొనసాగుతుండగా మంగళవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జేకే మహేశ్వరి, నరసింహన్ ధర్మాసనం అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతుంది. హై కోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ ను విచారించేలా చూడాలని అవినాశ్ తన పిటిషన్ లో కోరారు, తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారంపాటు మినహాయింపు ఇవ్వాలని తన పిటిషన్ లో అవినాష్ అభ్యర్థించారు. దీంతో పాటు హై కోర్టులో తన బెయిల్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకుండా సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు.
27 తర్వాత వస్తా .. అవినాశ్
తన తల్లి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉండటంతో ఈ నెల 27వ తేదీ తరువాత తాను విచారణకు హాజరవుతానంటూ లేఖలో అవినాశ్ స్పష్టం చేసారు. సీబీఐ అధికారులు ధర్మ సందేహంలో పడినట్లు కనిపిస్తోంది. అవినాశ్ అటు లీగల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇటు మానవీయ కోణంలో అభ్యర్ధనలు చేస్తున్నారు. అవినాశ్ కు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు కర్నూలు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్దనే బైఠాయించారు. సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. తల్లి ఆరోగ్యం కుదుట పడగానే అవినాశ్ విచారణకు వస్తాయని నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో శాంతి భద్రతలపైన జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీబీఐ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు ఆసుపత్రికి విజయమ్మ
ఈ నాటకీయ పరిణామాల మధ్య కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ విజయమ్మ వెళ్లారు. విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ రెడ్డితో శ్రీ లక్ష్మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆమెకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
సీఆర్పీపీఎఫ్ బలగాలు…
కర్నూలులో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉన్నందున అదనపు బలగాలను పంపాలని జిల్లా ఎస్పీ కోరారని సమాచారం. కర్నూలులో పరిస్థితిని
ఎప్పటికప్పుడు గమనిస్తున్న జిల్లా ఎస్పీ డీజీపీకి నివేదికను ఇస్తున్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేస్తే… శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని
వివరించారు. మంగళవారం నాటికి అవినాశ్ అనుచరులు పెద్ద సంఖ్యలో కర్నూలుకు చేరుకోవచ్చని తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున తలెత్తిన పరిణామాలే మరో సారి ఎదురయ్యే అవకాశముందని కూడా జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
ఉత్కంఠ
ఇప్పుడు అవినాశ్ కోరిన విధంగా సీబీఐ అభ్యర్ధనలను అంగీకరించి ఉంటే కర్నూలులో ఉండాల్సిన అవసరం లేదు. మరి సీబీఐ ఏం చేయనుంది. రాత్రి పొద్దుపోయినాక చర్యలకు దిగుతుందా. అందుకు స్థానిక అధికారుల నుంచి సహకారం అందుతుందా. జూన్ నెలాఖరులోగా వివేకా హత్య కేసును సీబీఐ ముగించాల్సి ఉంది. ఇప్పుడు కర్నూలు లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీబీఐ తదుపరి అడుగుల పైన ఉత్కంఠ కొనసాగుతోంది