9th Nizam: 9వ నిజాంగా రౌనక్‌ఖాన్ ఏకగ్రీవం, వారసత్వ కమిటీ ప్రకటన
Asaf Jahi family coronates Raunaq Yar Khan as Nizam IX
నిజాం వారసుడిగా నవాబ్ రౌనక్‌ఖాన్ ఎన్నికయ్యారు. రౌనక్ ఖాన్ ను ఏకగ్రీవంగా ప్రకటించినట్టు నిజాం వారసత్వ కమిటీ వెల్లడించింది. మొఘల్‌పురలోని ఆజం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిజాం కుటుంబసభ్యులు.. నిజాం వారసుడిగా 9వ నిజాంగా నవాబ్ రౌనక్‌ఖాన్‌ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. నిజాం ట్రస్ట్ కార్యక్రమాలు ఇక నుంచి రౌనక్‌ఖాన్ నేతృత్వంలో కొనసాగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజాం వారసుడిగా రౌనర్ ఖాన్ ఎన్నికైన సందర్భంగా కుటుంబసభ్యులు అపురూపమైన బహుమతులను అందించి అభినందించారు.
గత నెలలో నిజాం వారసుడిగా మిర్ అజ్మత్ అలీ ఖాన్ ను నియమించారు. ముఖర్రం ఝా బహదుర్ వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. నిజాం వారసుడిగా ఎంపికైన నాటి నుంచి నిర్వర్తించాల్సిన అనేక బాధ్యతలను అజ్మత్ అలీ ఖాన్ విస్మరించడం, కొన్ని న్యాయపరమైన చిక్కులను అస్సలు పట్టించుకోకపోవడం వంటి అంశాలు నిజాం ట్రస్ట్ నిర్వాహకులకు అసహనం కలిగించాయి. దీంతో అజ్మత్ అలీ స్థానంలో రౌనక్ ఖాన్ నియామకం జరిగినట్లు తెలిపారు. అజ్మత్ అలీఖాన్ తమకు అస్సలు సహకరించడం లేదని, పలుమార్లు ఆయనను సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని నిజాం ట్రస్ట్ సభ్యులు తెలిపారు.