Hyderabad Cable Bridge: హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జి..ఎక్కడంటే
Another cable bridge In Hyderabad: హైదరాబాద్ మహానగరం ఇప్పుడు విశ్వనగరంగా మారుతున్నది. ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన ఎన్నో కంపెనీలు హైదరాబాద్ నగరంలో కొలువుదీరాయి. ఫార్మా హబ్ కూడా హైదరాబాద్ కు వస్తున్నది. విశ్వనగరం అన్న పేరుకు తగ్గట్లుగా హైదరాబాద్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇక నగరంలో టెక్నాలజీ ప్రాంతంగా అభివృద్ధి చెందిన మాదాపూర్ లో ఇటీవలే కేబుల్ బ్రిడ్జి ని ఏర్పాటు చేశారు. దుర్గం చెరువు పై ఏర్పాటు చేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు అక్కడికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. ఇప్పుడు నగరంలోని మరో ప్రాంతంలో కూడా కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది.
పాతబస్తీలో కూడా ఈ తరహా కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. పాతబస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రపోజల్స్, ప్లాన్ ను హెచ్ ఎండిఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కోన్నారు. పాతబస్తీలో ఇప్పటికే చార్మినార్, సాలర్జంగ్ మ్యూజియం, మక్కా మజీద్ వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పాతబస్తీలో కేబుల్ బ్రిడ్జి ని కొత్తగా ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
దుర్గం చెరువు పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రూ.184 కోట్లతో నిర్మించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా ఈ కట్టడం రికార్డు కెక్కింది. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించగా.. నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు 755 మీటర్లు. ఆరు లైన్ల వెడల్పుతో దీన్ని నిర్మించారు. అంటే సుమారు వెడల్పు 26 మీటర్లు ఉండనుంది. వంతెనకు ఆధారం రెండు భారీ స్తంభాలు. వీటిని చెరువు ఒడ్డు సమీపంలో నిర్మించారు. ఈ పైలాన్ల ఎత్తు 57 మీటర్లు కాగా, వీటి మధ్య దూరం 233.8 మీటర్లు. ఈ బ్రిడ్జిని పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి చేపట్టారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.