Amit Shah Strategy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అమిత్ షా… హైదరాబాద్‌లోనే మకాం
Amit Shah Strategy on TS Assembly Elections 2023: ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేని కేంద్ర అధిష్టానం ప్రగాఢంగా విశ్వసించడం మొదలుపెట్టింది. వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు చెబుతూ వస్తున్నది. అయితే, స్థానికంగా ఉన్న సమస్యలు, పార్టీ నేతల మధ్య ఉన్న సమస్యల కారణంగా ఆ అవకాశం జారిపోయే అవకాశం ఉండటంతో పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగక తప్పడం లేదు. తెలంగాణపై కన్నేసిన కాషాయం పార్టీ పార్టీని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇటీవలే ఉన్నఫలంగా బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించి క్లాస్ ఇచ్చింది.
ఒకవైపు చేస్తున్న పనులను ప్రశంసిస్తూనే, అలసత్వం వహించవద్దని సున్నితంగా హెచ్చరిస్తూ వార్నింగ్ ఇచ్చింది. పార్టీ నేతల మధ్య సమస్యలు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, పార్టీని అప్పతిష్ట పాలు చేయవద్దని హెచ్చిరించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తీరాలనే సంకల్పంతో పార్టీ నేతలు అడుగులు ముందుకు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ ఏడాది తెలంగాణ ఎన్నికల కంటే ముందు కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. కన్నడ బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో ఆ రాష్ట్రంపై అమిత్ షా దృష్టి సారించారు. వచ్చె నెల నుండి కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు ఆ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
ఇందుకోసం బెంగళూరులో ఇళ్లు అద్దెకు తీసుకొని ఢిల్లీ నుండి బెంగళూరు రానున్నారు. ఒకవైపు కర్ణాటక బీజేపీ రాజకీయాలను చక్కదిద్దుతూనే ఎన్నికలను సజావుగా పూర్తి చేయించి మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై కూడా దృష్టి సారించాలని కూడా ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా అమిత్ షా మకాం పెట్టనున్నారు. అంతేకాదు, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది ఒకేసారి కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి సౌత్‌లో బలంగా పాగా వేయాలని బీజేపీ చూస్తున్నది.
దీనికి అవకాశం ఉన్న అన్ని దారులను అన్వేషిస్తున్నది. ఇప్పటికే పట్టణ, నగరాల్లో బీజేపీ బలంగా మారింది. భాగ్యనగరంలో బీజేపీ భారీగా బలం పెంచుకున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం భారీగా పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్‌ను సొంతం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నది. షా హైదరాబాద్‌లో ఉంటేనే ఇదంతా సాధ్యం అవుతుందని భావించిన అధిష్టానం ఆయన్ను సౌత్ కు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కూడా కీలకంగా మారాయి. గత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్‌ను ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన బీఆర్ఎస్, మూడోసారి కూడా సెంటిమెంట్ అంటే ప్రజలు ఒప్పుకునేలా లేరు. రెండు సార్లు వరసగా విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత ఉన్నది. అయితే, ఆ వ్యతిరేకత బయట వరకే ఉంటుందా, ఎన్నికల్లో ఓటు వేసేంత వరకు ఉంటుందా అన్నది చూడాలి.