Amit Shah on Central Agencies Enquiry: కాకరేపుతున్న షా వ్యాఖ్యలు… అరెస్టులు తప్పవా?
Amit Shah on Central Agencies Enquiry: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఏజెన్సీలు చేస్తున్న విచారణలు ఆందోళనల కలిగిస్తున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణ జరుపుతున్నది. మార్చి 10 వ తేదీన ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు హాజరయ్యారు. కాగా, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అవినాశ్ రెడ్డిని మార్చి 13 వరకు అరెస్టులు చేయలేదు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, హత్య కేసుతో తనకు సంబంధం లేని అవినాశ్ రెడ్డి చెబుతున్నాడు. మార్చి 13 తరువాత అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టిస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే కవిత ఒకమారు సీబీఐ విచారణ, మరోసారి ఈడీ విచారణ ఎదుర్కొన్నది. సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి విచారించగా, ఈడీ విచారణ కోసం ఆమె ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మార్చి 11వ తేదీన సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాగా, ఏడు గంటలకు పైగా ఈడీ విచారణ జరిపింది. మరోసారి ఆమె ఈడీ ముందు హాజరుకావల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. సీఐఎస్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తరువాత, ఓ సందర్భంలో షా కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఏజెన్సీలు సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నవారు అరెస్టులు కాక తప్పదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పడు రాష్ట్ర రాజకీయంలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేంద్ర ఏజెన్సీలు ఏపీలో అవినాశ్ రెడ్డిని, తెలంగాణలో కవితను విచారించాయి. వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైకాపా నేతలు అప్రమత్తం అవుతున్నారు. ఒకవేళ కవితను అదుపులోకి తీసుకుంటే ఎలా రియాక్ట్ కావాలనే దానిపై కూడా నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ గట్టిగా కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కలిసివచ్చే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. లిక్కర్ కేసు వెలుగులోకి రావడం, హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయని కేంద్ర ఏజెన్సీలు గుర్తించడం, విచారణలో భాగంగా కవిత పేరు బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్‌లో పడిపోయింది. దీనినే మెయిన్ పాయింట్‌గా తీసుకొని బీజేపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నారు.
అటు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడంతో పోటీ భారీగా ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి 16 తరువాత రాష్ట్రంలో జరిగే కీలక పరిణామాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని అమిత్ షా హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అనేక మందిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే దానిపైనే విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి.