Amberpet CI Sudhakar Arrest: చీటింగ్ కేసులో అంబర్ పేట్ సీఐ సుధాకర్ అరెస్ట్
Amberpet CI Sudhakar Arrest:ఎన్ఆర్ఐను చీటింగ్ చేసిన కేసులో హైదరాబాద్ అంబర్ పేట్ సీఐ సుధాకర్ ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు సీఐ సుధాకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 54 లక్షలకు ఇప్పిస్తానని సుధాకర్.. ఓ ఎన్ఆర్ఐకి చెప్పాడు. దీంతో అతను సుధాకర్‌ను నమ్మి పలు దఫాల్లో రూ. 54 లక్షలు ఇచ్చాడు.
ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్‌కు గురైన రాజేశ్‌ను ఎమ్మార్వోగా ఎన్ఆర్ఐకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశే భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మబలికాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్ఆర్ఐ తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు అందించాడు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.