9 States Elections 2023: భేతాళ రాజకీయం… ఆధిపత్యం కోసం పోరాటం
9 States Elections 2023: 2023లో దేశంలోని తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ 9 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో వీటిని సెమీస్‌గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంతో ఆ పార్టీలు లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు మూడు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ, అనుబంధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. నాగాలాండ్, మేఘాలయలో బీజేపీ, దాని అనుబంధ పార్టీలు మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతుండగా, త్రిపురలో బీజేపీకి కమ్యునిస్టుల నుండి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కమ్యునిస్టులకు గట్టి పట్టున్న త్రిపుర కోటలో కాషాయం జెండాను ఎరగవేసినా, ఈసారి మార్పు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. అయితే, చివరినిమిషంలో ఓటర్ల ఆలోచనలు బట్టే అధికారం ఉంటుంది.
ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఈ ఏడాది మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికమని చెప్పాలి. దక్షిణాదిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నా, అంతర్గత కలహాలు, భాగస్వామ్య పార్టీలతో విభేదాల కారణంగా పార్టీ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. దీనిని కాషాయం తనకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. కాగా, ఈఏడాది జరగనున్న ఎన్నికల్లో కాషాయం పట్టు నిలుపుకోగలుగుతుందా లేదంటే, కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాలి. గత ఏడాది కాలంగా రెండు పార్టీలు కర్ణాటకంలో ప్రచారం చేసుకుంటున్నాయి. జేడీఎస్ తన పట్టును నిలుపుకోవడం ప్రయత్నిస్తుండగా, బళ్లారి కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఇకపోతే, తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాషాయం ఎదుగుతున్నది. అయితే, బలంగా ఉన్న బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడం అంత ఈజీ కాదన్నది కొందరి వాదన. కాంగ్రెస్ బలహీనపడటంతో కమలానికి చోటు దక్కింది. బండి సంజయ్ కి రాష్ట్రపగ్గాలు అప్పగించిన తరువాత మరింత దూకుడు పెరిగింది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం మెరుగైన ఫలితాలు రాబట్టింది. మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైనా భారీగా ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ స్పష్టం చేసింది. ఎన్నికల వరకు ఇదే దూకుడును ప్రదర్శిస్తే కారు జోరుకు బ్రేకులు వేయవచ్చని అంచనా వేస్తున్నారు. కమలాన్ని ఎదుర్కొనేందుకే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్ ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి. జాతీయ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరి చూపులు తెలంగాణ మీదనే ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా, చత్తీస్‌గడ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఈసారి ఎలాగైనా ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని కాషాయం, మరోసారి పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కమలం రెపరెపలాడుతున్నది. అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలని చూస్తున్నది. ఆయన్ను కేంద్రంలోకి తీసుకొని, యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్రకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నది. మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందన్నది ఈ తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలతో తేలిపోనున్నది. రాహుల్ పాదయాత్ర అంశాన్ని నేతలు ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లగలరనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అధికారం కోసం పార్టీలు చేస్తున్న ఈ పోరాటంలో విజయం ఎవర్ని వరిస్తుందో ఆ భేతాళుడికే తెలియాలి.