Gauhar Chishti Arrested : ఎట్టకేలకు గౌహర్ చిస్తీ అరెస్ట్
Ajmer cleric Gauhar Chishti arrested in Hyderabad : బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై అభ్యంతరకర నినాదాలు చేసి పరారీలో ఉన్న అజ్మీర్ దర్గా ఖాదీం గౌహర్ చిస్తీని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. నుపుర్ శర్మ అంతకుముందు మహమ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్రదుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఇండియాలో ముస్లిం హక్కులను కాపాడాలంటూ ఏకంగా ఐక్యరాజ్య సమితికి లేఖ రాసేదాకా విషయం వెళ్ళింది. ఆ తరువాత నుపుర్ శర్మ క్షమాపణ చెప్పినప్పటికీ, ఆమె వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 17న అజ్మీర్‌లో నిర్వహించిన మౌన ప్రదర్శనలో గౌహర్ చిస్తీతో పాటు పలువురు నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జూన్ 23న చిస్తీపై అజ్మీర్‌లో కేసు నమోదైంది. అప్పటి నుండి పరారీలో ఉన్న గౌహర్ ను తాజాగా హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
ఈ కేసులో వైరల్ వీడియోల ఆధారంగా పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దర్గా వాసులు తాజిమ్ సిద్ధిఖీ, ఫఖర్ జమాలీ, హసన్ దాల్, రియాజ్ హసన్, మొయిన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులు ప్రస్తుతం హై సెక్యూరిటీ జైలులో ఉన్నారు. గౌహర్ చిస్తీని శుక్రవారం అజ్మీర్‌కు హైసెక్యూరిటీ నడుమ తరలించనున్నారు. ఇక నుపుర్ శర్మపై అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తిని పోలీసులు ఇంతకుముందే అరెస్ట్ చేశారు. నుపుర్ శర్మ తల నరికి తెస్తే, ఇంటిని గిఫ్ట్ గా ఇస్తానని సల్మాన్ చిస్తీ ప్రకటించడంతో అతనిపై కేసు నమోదైంది. అతనిప్పుడు జైల్లో ఉన్నాడు.
అజ్మీర్ దర్గాకు చెందిన ముగ్గురు ఖాదీంలు ముగ్గురు సల్మాన్ చిస్తీ, ఆ తర్వాత సయ్యద్ గౌహర్ చిస్తీ, ఆదిల్ చిస్తీ రెచ్చగొట్టే విధంగా, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఆదిల్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. నుపుర్ శర్మకు సపోర్ట్ చేసినందుకు టైలర్ కన్హయ్య లాల్ ను ఈ నెల 28న ఉదయ్ పూర్ లో దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చేసింది రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ అని తేలడంతో రాజస్థాన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసింది.