Airport Metro Rail Design: 26 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు
Airport Metro Rail Design: రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలును నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా నిధులను కేటాయించి ఈ మెట్రోను నిర్మిస్తున్నది. మూడేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని నిర్ణయించారు. కాగా, రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు మొత్తం 31 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనున్నది. ఇక ప్రతి 2 నుండి 3 కిలోమీటర్లకు ఒక మెట్రో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రాయదుర్గం నుండి ఎయిర్ పోర్టు వరకు మొత్తం 14 స్టేసన్లను నిర్మించనున్నారు. 31 కిలో మీటర్లను 26 నిమిషాల్లోగా చేరుకునేలా డిజైన్ చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగునంగా ప్రాజెక్టును రూపకల్పన చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 21 కిమీ మేర సర్వే కూడా పూర్తైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మెట్రో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, ఎయిర్‌పోర్టుకు రవాణా సౌకర్యం మరింత పెరుగుతుందని, టూరిజం పరంగా కూడా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఎయిర్‌పోర్ట్ రైల్వేను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.