Hyderabad: గ్రేటర్ లో మరో ప్రస్థానం మొదలుకానుంది..రోజురోజుకు నగరాభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక ఐటి రఁగంలో హైదరాబాద్ డి కీలకపాత్ర..ఐటీ కంపెనీల కార్యకలాపాలతో హైదరాబాద్ మహానగరం నలుదిక్కులా శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక ను రూపొందిస్తోంది.
పిల్లర్లు నిర్మించి దానిపై ఎలక్ట్రికల్ బస్సులను నడిపేలా కొత్తగా ఎలివేటెడ్ బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టిమ్ కు రూపకల్పన చేస్తోంది. మెట్రో రైలు మాదిరిగానే ఉండే బస్సు బోగీలు రోడ్డు మీద కాకుండా ఫ్లై ఓవర్ లో పరుగులు పెట్టేలా ప్రత్యేకంగా పిల్లర్లను నిర్మిస్తూ వాటికి అనుసంధానంగా ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ ట్రాక్‌కు విద్యుత్ సరఫరా అనుసంధానమై ఉంటుంది. మెట్రో స్టేషన్ మాదిరిగా ఎక్కువ స్థలం అవసరం లేకుండా అతి తక్కువ స్థలంలోనే ప్రయాణికులు వాటిని ఎక్కి, దిగేందుకు వీలుగా నిర్మాణాలు చేపడతారు. ఇలా ఇప్పటి వరకు దేశంలోనే లేనటువంటి అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం రాయదుర్గం వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించాలన్న ప్రతిపాదన ఉండడంతో దాన్ని నార్సింగి వద్ద కలిసేలా ఈబీఆర్టీఎస్ మార్గానికి రూపకల్పన చేస్తున్నారు.