Agniveers in Hyderabad: హైదరాబాద్‌లో అగ్నివీరులు… 31 వారాలపాటు శిక్షణ
Agniveers in Hyderabad: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైనిక నియామకాల ప్రక్రియ అగ్నిపథ్‌లో భాగంగా హైదరాబాద్‌లో 2300 మంది అగ్నివీర్‌లకు శిక్షణ ఇస్తున్నారు. జనవరి 1వ తేదీ నుండి ఈ శిక్షణ ప్రారంభమైంది. సుమారు 31 వారాలపాటు శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ చాలా కఠినంగా ఉండనున్నది. అన్ని విధాలుగా సైన్యంలో ఉపయోగపడేవిధంగా తర్ఫీదు ఇస్తున్నారు. 31 వారాల శిక్షణ అనంతరం వీరికి దేశ సైన్యంలో పోస్టులు ఇస్తారు. ఇక, ఫిబ్రవరి మాసంలో మరో 3200 మంది అగ్నివీరులు హైదరాబాద్‌లో శిక్షణకోసం రానున్నారు. నగరంలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న ఆర్టిలరీ సెంటర్‌లో ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతున్నది. మానసికంగా, శారీరకంగా, సాంకేతికంగా అగ్నివీరులను తీర్చిదిద్దనున్నారు. అదేవిధంగా ఆయుధాలను ఉపయోగించే విధానంలో కూడా శిక్షణ అందించనున్నారు.
దేశంలోని వివిధ సైనిక కేంద్రాల్లో అగ్నివీరులు శిక్షణ పొందుతున్నారు. కేంద్రం అగ్నిపథ్ సైనిక నియామక కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. సంప్రదాయక నియామకాలనే నిర్వహించాలని పలువురు పట్టుబట్టారు. ప్రతిపక్షాలు సైతం వారికి గొంతు కలిపింది. కానీ, కేంద్రం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా వ్యూహాత్మకంగా నియామకాలు చేపట్టడంతో అల్లర్లు సద్దుమణిగాయి. ఆర్హత ఉన్నవారికే సైన్యంలో ఉద్యోగం లభిస్తుందని, నిరసనలు, అల్లర్లు చేసిన వారికి ఎట్టిపరిస్థితుల్లో కూడా సైన్యంలోకి తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకున్నది.