Harish Rao: మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ కార్యక్రమం
Aarogya Mahila Special programme from March 8
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ఎన్నడూ లేనంతగా ఫోకస్ చేస్తోంది. హరీశ్ రావు ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరోగ్యశాఖ పలు వినూత్న కార్యక్రమాల ద్వారా పరుగులు పెడుతోంది. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం ప్రారంభించనుంది.
మహిళా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ నూతన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన వారికి CPR విధానంపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్, పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.
CPR విధానం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని కోరారు.అన్ని కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.