IPS Transfers in TS: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు
91 Police Officers Transfer in Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 91 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులకు స్థాన చలనం కలిగింది. ఇందులో 51 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా, మరో 40 మంది నాన్ కేడర్ అధికారులు కూడా ఉన్నారు. రాజకోండ, హైదరాబాద్ జాయింట్ కమిషనర్లుగా సత్యన్నారాయణ, గజరావు భూపాల్‌ను నియమించగా, రామగుండం కమిషనర్‌గా రెమా రాజేశ్వరిని నియమించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజులెన్స్ డైరెక్టర్‌గా ప్రకాశ్ రెడ్డిని నియమించారు.
శాంతి భద్రతల ఏఐజీగా సన్‌ప్రీత్ సింగ్‌ను, బాలానగర్ డీసీపీగా టి శ్రీనివాసరావును, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా జానకీ షర్మిలను నియమించారు. వీరితో పాటు ఇతర అధికారులకు కూడా స్థానచలనం కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. రిపబ్లిక్ దినోత్సవం ముందు రోజు ఈ బదిలీలు జరగడం విశేషం. ఈ ఏడాది తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. బదిలీ ఆర్డర్లు పొందిన పోలీస్ అధికారులు హుటాహుటిన తమ విధుల్లో చేరేందుకు సిద్ధమౌతున్నారు. చడీచప్పుడు లేకుండా అధికారుల బదిలీలు జరగడంతో ప్రతిపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బదిలీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని కొందరు చెబుతున్నారు.