మారని తీరు…మందుబాబులకు జైలు శిక్ష…
మందుబాబులకు కోర్ట్ షాకిచ్చింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 32 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నాలుగోసారి పట్టుబడిన ఆర్ నవీన్ అనే వ్యక్తికి కోర్టు 34 రోజుల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2016 ఆగస్ట్ లో మద్యం సేవించి సుల్తాన్ బజార్ లో పోలీసులకు దొరికిపోగా రూ. 2 వేల రూపాయలు జరిమానా విధించారు. కాచిగూడ లో రెండోసారి పట్టుబడగా రెండువేలు జరిమానా, 3 రోజులు జైలు శిక్ష విధించారు. మూడోసారి సుల్తాన్ బజార్ లో పోలీసులకు పట్టుబడగా రూ. 2100 జరిమానా 4 రోజుల జైలు శిక్ష విధించారు.
అయితే, తీరు మార్చుకోకుండా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు నాలుగోసారి పట్టుబడిన నవీన్ కు నాంపల్లి 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 34 రోజులపాటు జైలు శిక్షను విధించింది. అంతేకాదు, సెంట్రల్ జోన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మరో 31 మందికి నాంపల్లి 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజులపాటు జైలు శిక్ష విధించింది.