Hurun List: సంపన్న మహిళల జాబితాలో 12 మంది హైదరాబాద్ మహిళలు
భారతదేశంలో సంపన్న మహిళల జాబితాను కొటక్ ప్రైవేటు బ్యాంకింగ్ – హురున్ విడుదల చేసింది. ఈ నివేదికను డిసెంబరు 31, 2021 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా రూపొందించింది.. సంపన్న మహిళల జాబితాలో 12 మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. దివీస్ డైరెక్టర్ నీలిమ మోటపర్తి నాల్గవ స్థానం సంపాదించుకుని మొదటి 10 మంది సంపన్న మహిళల జాబితాలో నిలిచారు. ఈమెతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో 11 మంది సంపన్నుల జాబితాలో ఉన్నారు.
100 మంది మహిళల ఆదాయం 2020తో పోల్చితే 2021లో బాగా వృద్ధి చెందింది. 2.72 లక్షల కోట్ల నుంచి 4.16 లక్షల కోట్లకు చేరింది. వీరి మొత్తం ఆదాయం భారతదేశపు జీడీపీలో 2 శాతంగా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో ఫార్మాసుటికల్ రంగం, ఆరోగ్య రంగం, వినియోగ వస్తువుల రంగానికి చెందిన వారే అధికంగా ఉన్నారు.
టాప్ 3లో నిలిచిన వారు
మొదటి స్థానంలో రోషనీ నాడార్, రెండో స్థానంలో ఫల్గుణీ నాయర్ నిలవగా..మూడవ స్థానంలో కిరణ్ మజుందార్ షా నిలిచారు.
హైదరాబాద్ నుంచి 12 మంది
మొత్తం జాబితాలో ఢిల్లీ నుంచి వచ్చిన మహిళలే ఎక్కువగా ఉన్నారు. 25 మంది ఢిల్లీకి చెందిన వారు కాగా, 21 మంది ముంబై, 12 మంది హైదరాబాద్‌కి చెందిన వారు ఉన్నారు. దివీస్ డైరెక్టర్ నీలిమ మోటపర్తి నాల్గవ స్థానంలో నిలిచారు. బయోలాజికల్ ఈ సంస్థకు చెందిన మహిమా దాట్ల రూ. 5530 కోట్ల సంపాదనతో జాబితాలో 13వ స్థానంలో నిలిచారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన సునీత రెడ్డి, ప్రీత రెడ్డి, శోభన కామినేని, సంగీత రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన సుచిత్ర ఎల్ల కూడా ఈ జాబితాలోచోటు సంపాదించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ జాబితాలోకి చేరిన వారిలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ – పద్మజ గంగిరెడ్డి, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ – అంజనా రెడ్డి, విజయ డయాగ్నస్టిక్ సెంటర్ సుప్రీతా రెడ్డి కూడా ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన దేవి సీ ఫుడ్స్ ఎన్.నవీన, పి.రమా దేవి కూడా జాబితాలో చోటు సంపాదించారు.