అవినాశ్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను రాలేనంటూ ఆయన లేఖ రాయటం, సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవటం ఉత్కంఠ రేపుతోంది.
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు ముందు
కీలక పరిణామం. ఆ కేసు విచారణలో ఇవాళ అవినాశ్ విచారణకు రావాల్సి ఉండగా…తాను రాలేనంటూ సీబీఐకి ఆదివారం సాయంత్రం లేఖ పంపారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు వచ్చారు. అధికారులే ఆసుపత్రికి చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనను ఏక్షణమైనా అరెస్టు చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక ఆసుప్రతి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కర్నూలు లో టెన్షన్
మరోవైపు వైకాపా కార్యకర్తలు అవినాష్‌రెడ్డి ఉంటున్న ప్రాంతానికి భారీగా తరలివస్తున్నారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వారిని దూరంగా పంపేస్తున్నారు. ఆదివారం రాత్రి కర్నూలు నగరంలో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. విశ్వభారతి ఆసుపత్రి వద్ద విధి నిర్వహణలో ఉన్న పలువురు మీడియా ప్రతినిధుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. వారిని నానా దుర్భాషలాడారు. రాత్రి వేళ మీకు ఇక్కడేం పని అంటూ దాడి చేశారు. కొందరు మీడియా ప్రతినిధుల చేతుల్లోని కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. అసలు ఆ వీధిలోకి ఇతరులెవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు.