జనరిక్ మందులు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి.
Generic Medicine: ప్రభుత్వ ఆసుపత్రులకు (Govt Hospital) వచ్చే రోగులకు కేవలం జనరిక్ మందులనే (Generic Medicine) రాయాలని, వారికి బ్రాండెక్ మందులు సూచించవద్దని కేంద్రం (Central Govt) ఆదేశాలు ఇచ్చింది. ఇది హాట్ టాపిక్ గా మారడంతో అసలు జనరిక్ మందులు అంటే ఏమిటి? అనే సందేహం ఎక్కువ మందికి వచ్చింది. వాటినే సూచించమని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది అని కూడా ఆలోచిస్తున్నారు ఎంతోమంది.
జనరిక్ మందులు అంటే?
వీటిని పేదవారి మందులుగా చెప్పుకోవచ్చు. ఒక కొత్త మందును కనిపెట్టడానికి ఫార్మా కంపెనీలు చాలా కష్టపడతాయి. ఎంతో ఖర్చు చేస్తాయి. అలా ఒక మందును కనిపెట్టాక, దాని ద్వారా ఫార్మా కంపెనీ లాభం పొందేందుకు 20 ఏళ్ల పాటూ పేటెంట్ హక్కులను ఇస్తుంది ప్రభుత్వం. 20 ఏళ్లు ఆ ఫార్మా కంపెనీ సదరు మందుపై అన్ని హక్కులు కలిగి ఉంటుంది. 20 ఏళ్లు దాటాక మాత్రం ఆ మందు ఫార్ములాతో ఎవరైనా అలాంటి మెడిసిన్ తయారు చేయవచ్చు. అలా తయారు చేసి తక్కువ ధరకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే ఇవి బ్రాండెడ్ మందులు కావు. మందుల కవర్లపై ఎలాంటి బ్రాండ్ పేరు ఉండదు. కేవలం మందు పేరు మాత్రమే ఉంటుంది. బ్రాండెడ్ అంటే… సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్ ఇలా. కేవలం పేదవారి కోసమే జనరిక్ మందులను తయారు చేస్తారు. బ్రాండెడ్ మందులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తాయో జనరిక్ మందులు కూడా అంతే సమర్ధవంతంగా పనిచేస్తాయి. అలాగే వీటి రేటు కూడా తక్కువగా ఉంటుంది. 100 రూపాయల బ్రాండెడ్ మందు, జనరిక్ మెడిసిన్లో కేవలం 30 రూపాయలకే దొరుకుతుంది.
జనరిక్ మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి వాటినే ప్రిస్క్రిప్షన్లో రాయాలని కేంద్రం ప్రభుత్వ వైద్యులను ఆదేశించింది. బ్రాండెడ్ మందులు రాయడం ఎక్కువవడంతో, ఆ పద్ధతి నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రలకు మెడికల్ రిప్రెజెంటేటివ్స్ రావడాన్ని కూడా అడ్డుకోవాలని కేంద్రం భావిస్తోంది.
రామ్ చరణ్ సినిమా అయిన ధ్రువ సినిమా ఈ జనరిక్ మందుల చుట్టే తిరుగుతుంది. మన చుట్టూ జనరిక్ మందులు షాపులు ఉంటున్నప్పటికీ, ఎవరూ వాటిని కొనేందుకు వెళ్లడం లేదు. బ్రాండెడ్ మందులు కొనేందుకే ఇష్టపడుతున్నారు. నిజానికి రెండూ ఒకేలా పనిచేస్తాయి.