ఎండ వేడిని తట్టుకోలేక చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు.
HeatWaves : వాతావరణంలోని ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలో వేడి పెరుగుతుంది. మన శరీరం ఎక్కువ వేడిని సహించలేదు. అందుకే అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువ సమయం పాటూ గురైతే శరీరం వడదెబ్బ బారిన పడతుంది. మనదేశంలో వేసవిలో ఎండలు, వాటి వల్ల కలిగే వేడి, వడగాడ్పులు కూడా చాలా ఎక్కువ. వడగాడ్పులు అంటే వేడి గాలులు. వీటి వల్ల కూడా శరీరం వడదెబ్బ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. ఎండలను తట్టుకునేందుకు ముందుగానే సిద్ధమవ్వాలి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేడిని తట్టుకునే శక్తిని మన శరీరానికి ఇవ్వచ్చు.
1. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి. అలా పెరగకుండా ఉండాలంటే ఎండలో ఎక్కువ సమయం ఉండకూడదు. శరీరం 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతకు చేరుకుందంటే వడదెబ్బ కొట్టినట్టే. కాబట్టి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
2. వేడి వల్ల శరీరం చెమట పడుతుంది. ఆ చెమటలో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతాయి. అప్పుడు డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. అధికంగా శరీరానికి చెమటపడితే వెంటనే గ్లాసుడు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ కలుపుకుని తాగితే ఎంతో మంచిది. వెంటనే ఎలక్ట్రోలైట్స్ శరీరంలో భర్తీ అవుతాయి. దాహం వేయడంలో సంబంధం లేకుండా ప్రతి గంటకు గుక్కెడు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఏసీలో పనిచేసేవారు కూడా ఈ పని చేయాలి.
3. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలి. నీరు నిండుగా ఉండే వాటర్ మెలన్ వంటి పండ్లు అధికంగా తీసుకోవాలి. అలాగే నీరు అధికంగా ఉండే సొరకాయ, పాలకూర, బీట్రూట్ వంటి కూరలు అధికంగా వండుకోవాలి.
4. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగు ఉండే కాటన్ వస్త్రాలు ధరించాలి. ఇవి మీకు గాలి ఆడేలా చేస్తాయి, వడదెబ్బ బారిన పడినా కూడా శరీరానికి గాలి ఆడేలా ఈ వస్త్రాలు సహకరిస్తాయి. తలపై టోపీ పెట్టుకోవడం మాత్రం మరిచిపోవద్దు.
5.ఎండలు మండిపోతున్న కాలంలో మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండడం మంచిది. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తాయి. అసలే ఎండల వల్ల శరీరం అల్లాడుతుంటే, వీటిని కూడా మీరు తాగితే ప్రమాదం. త్వరగా వడదెబ్బ బారిన పడే అవకాశాలు పెంచుకున్నవారవుతారు.