Eyes And Summer: అరగంట మండే ఎండల్లో బయటికి వెళ్లి వస్తే చాలు… ఆ వేడి గాలులకు కళ్ళు పొడిబారిపోయి, మండిపోతాయి. కళ్ళు నేరుగా ఎండకు గురైనప్పుడు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మండే ఎండల్లో కళ్ళను ప్రత్యేకంగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ. దాదాపు 220 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్టు అంచనా. వేసవికాలంలో సూర్య కిరణాల నుంచి యూవీ కిరణాలు చర్మాన్ని ఎలా హాని ప్రభావితం చేస్తాయో, కళ్ళను కూడా అంతే ప్రభావితం చేస్తాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అందుకే మండే ఎండల్లో సన్ గ్లాసెస్ వాడమని చెబుతారు. అలాగే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
1. వేసవికాలంలో కళ్లు పొడిబారడం జరుగుతూ ఉంటుంది. అలా వదిలేస్తే అది కంటి సమస్యగా మారుతుంది. వేసవిలో పెరుగుతున్న వేడి వల్ల బలమైన గాలులు వీస్తాయి. అవి కళ్ళలోని తేమను పీల్చేసుకుంటాయి. దీనివల్ల కళ్ళు డిహైడ్రేషన్ బారిన పడి, చికాకుగా మారుతాయి. కాబట్టి ఎక్కువ నీటిని తాగాలి. కళ్ళు తేమవంతంగా ఉండాలి. కెఫీన్ ఉండే ఆహారాలను మానేయాలి. ఆల్కహాల్, కాఫీ, టీలను తక్కువగా తాగితే మంచిది.
2. వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ మంది సాయంత్రం పూట స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు వెళుతూ ఉంటారు. ఆ పూల్స్‌లో ఉండే వాటర్‌లో క్లోరిన్ ఉండే అవకాశం ఉంది. అది కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల కళ్ళల్లో వాపు, మంట, దురద వంటివి వస్తాయి. కాబట్టి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నప్పుడు గాగుల్స్ ధరించడం మంచిది.
3. చర్మానికే కాదు వేసవిలో కళ్లకు కూడా చాలా రక్షణ అవసరం. వేడిని భరిస్తున్న కళ్ళు, కంప్యూటర్ను కూడా ఎక్కువ సేపు చూస్తాయి. దీనివల్ల కళ్ళు పొడి మారిపోతాయి. కాలుష్యం వల్ల కూడా కళ్ళు నిర్జలీకరణం బారిన పడే అవకాశం ఉంది. ఇలా డిహైడ్రేషన్కు గురైన కళ్ళు… కన్నీళ్లను ఉత్పత్తి చేయలేవు. కాబట్టి కంటిలోని పొడితనాన్ని పోగొట్టాలంటే కంటి చుక్కలను వాడాలి. వైద్యులను కలిస్తే కళ్లను హైడ్రేటెడ్‌గా ఉంచే ఐ డ్రాప్స్ ను సూచిస్తారు.
4. కొంతమంది చీటికిమాటికి కళ్ళను రుద్దుతూ ఉంటారు. ఇది ప్రమాదకరం. చేతులకి ఉండే సూక్ష్మజీవులు కళ్ళల్లో చేరి కంటి ఇన్ఫెక్షన్ను కలిగించవచ్చు. కాబట్టి కళ్ళను ముట్టుకునే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కంటి సర్జరీలు చేయించుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
5. ఎంతగా నిద్రపోతే కంటికి అంత మంచిది. రోజూ ఎనిమిది గంటల నిద్ర కళ్ళను కాపాడుతుంది. వాటికి తగిన విశ్రాంతిని అందిస్తుంది.