ఎండలు మండిపోతున్నాయని నిత్యం ఏసీ గదుల్లో గడిపే వారికి షాక్ ఇచ్చే కథనం ఇది.
Side Effects of AC : ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు (Temperature) వేగంగా పెరగడం వల్ల చాలామంది ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ ఏసీలు (Air conditioner) వేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు గడుపుతున్నారు. ఇలా 24 గంటలు కృత్రిమంగా నియంత్రించిన పర్యావరణంలో ఉండటం వల్ల భౌతికంగా సుఖంగా అనిపించవచ్చు, కానీ శరీర ఆరోగ్యపరంగా (Body Health) అది చాలా చేటు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు (Doctors) చెబుతున్న ప్రకారం రోజులో ఎక్కువ కాలం ఏసీలో (AC) ఉండకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రోజంతా ఏసీలో ఉండడం వల్ల తాజా గాలి, కాంతి శరీరానికి అందవు. అలాంటి వారిలో ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యంపై ఏసీలు ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావాలను చూపిస్తున్నాయో వివరిస్తున్నారు వైద్యులు. అధ్యయనాల ప్రకారం శ్వాసనాళాల వాపుకు కారణమయ్యే అవకాశం ఉంది. మరికొన్ని సమస్యలు కూడా మొదలయ్యే ఛాన్సులు ఉన్నాయి.
కళ్ళు పొడిగా మారడం
కండిషనర్లు గాలిలో తేమను బాగా తగ్గిస్తాయి. దీనివల్ల కళ్ళు తేమవంతంగా ఉండవు. పొడి లక్షణాలు పెరుగుతాయి. దీన్నే డ్రై ఐస్ అంటారు. పొడి కళ్ళు చాలా చికాకును, దురదను కలిగిస్తాయి. దృష్టి అస్పష్టంగా మారుతుంది.
తలనొప్పి
ఎక్కువకాలం ఎయిర్ కండిషనర్లలో పని చేసేవారు తలనొప్పి బారిన త్వరగా పడతారు. ముఖ్యంగా మైగ్రేన్లు వచ్చే అవకాశం ఉంది. అనల్స్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఇండోర్లో ఎయిర్ కండిషనర్ల మధ్య పని చేసే వ్యక్తుల్లో ఎనిమిది శాతం మంది నెలలో ఒకటి నుంచి మూడు రోజులు తలనొప్పి బారిన పడుతున్నట్టు అంచనా.
ఎలర్జీలను పెంచుతుంది
ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే గాలి సూక్ష్మజీవులకు నిలయం. దీనివల్ల అలోర్జీలు వస్తాయి. శరీరంలో హిస్టామిన్ విడుదల అధిక అవుతుంది. దీనివల్ల పదే పదే తుమ్ములు రావడం, సైనసైటిస్, ట్రాన్సిల్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
డీహైడ్రేషన్
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఏసీ గదుల్లో ఉండటం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఉండదని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఎయిర్ కండిషనర్లు మిమ్మల్ని మరింతగా డిహైడ్రేటెడ్ చేస్తాయి. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల వైఫల్యం, వడదెబ్బ వంటి బారిన పడే అవకాశం ఉంది.
తీవ్ర అలసట
ఎయిర్ కండిషన్ లో పనిచేసే వ్యక్తులు తరచూ అలసిపోతూ ఉంటారు. శ్వాస సమస్యలు కూడా వస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ.