మునగాకులను తినేవారి సంఖ్య తక్కువే. కచ్చితంగా తినాల్సిన ఆహారం అవి.
Drusmstick Leaves: పాలకూర (Spinach), తోటకూర, పుదీనా, కొత్తిమీర ఎలా వాడతామో… అలాగే మునగాకులను (Drumstick Leaves) కూడా కూరల్లో భాగం చేసుకోవాలి. పప్పు పాలకూర కలిపి వండినట్టే, పప్పు మునగాకులు (Dal and drumstick leaves) వండుకోవడం అలవాటు చేసుకోవాలి. మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. మునగాకును తినడం వల్ల ముఖ్యంగా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో ఉన్నట్టే పుష్కలమైన పోషకాలు మునగాకులో కూడా ఉన్నాయి. దీనిలో బీటా కెరాటిన్ సమృద్ధిగా ఉంటుంది. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు ఈ ఆకులతో ఉండిన ఆహారాన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు. ఈ ఆకులు తినడం వల్ల ఇనుము పుష్కలంగా శరీరానికి అందుతుంది. ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో వారు మునగాకులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీనితో సాధారణ పాలకూరతో చేసినట్టే కూర, పప్పు, వేపుడు, పొడి ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు. పిల్లలకు మునగాకుతో వండిన వంటలు తినిపించడం చాలా అవసరం.
పాలలో కాల్షియం ఉన్నట్టే మునగాకులో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో దాదాపు 400 మైక్రోగ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముక సంబంధిత సమస్యలు ఏవీ కూడా ఈ ఆకుల వల్ల దరి చేరవు. మధుమేహం ఉన్నవారు మునగాకుతో చేసిన వంటకాలు తినడం ఎంతో ముఖ్యం. వీరిలో ఇన్సులిన్ నిరోధకత అధికంగా ఉంటుంది. ఆ సమస్య నుంచి బయట పడేసే సామర్థ్యం మునగాకు ఉంది. అలాగే రక్తనాళాలు మందంగా మారకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
ఈ ఆకులో పీచు పుష్కలంగా ఉంటుంది. పీచుతో నిండిన ఆహారం తినడం వల్ల శరీరంలోని కొవ్వు బయటకు పోతుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు మునగాకుతో ఉండిన వంటలు తినడం చాలా అవసరం. ఈ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటును తగ్గించేందుకు పొటాషియం అత్యవసరం. మునగాకుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు… ప్రతి మూడు రోజులకు ఒకసారి మునగాకుతో వండిన వంటకాలు తినడం ముఖ్యం. వీటిలో ఫైటో కెమికల్స్, పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను, టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. మునగాకును పొడి రూపంలో చేసుకుని దాచుకుంటే కూరల్లో చల్లుకోవచ్చు.