2028లో అద్భుత సృష్టికి కారణం కాబోతోంది జపాన్.
Infertility: పిల్లలు పుట్టాలంటే స్త్రీ ,పురుషులు ఇద్దరూ అత్యవసరం. వారిద్దరి సంగమమే శిశువుల (Kids) అభివృద్ధికి కారణమవుతుంది. అయితే జపాన్ పరిశోధకులు స్త్రీపురుషుల (Men and Women) అవసరం లేకుండా ల్యాబ్ లోనే (Lab) శిశువులను (kids) అభివృద్ధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశోధన శరవేగంగా జరుగుతోంది. చాలామందిలో పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యల వల్ల పిల్లలు (Infertility)కలగడం లేదు. అలాగే కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే కొన్ని లోపాలు వస్తున్నాయి. వీటన్నింటికీ అధిగమించేందుకు, స్త్రీ పురుషుల అవసరం లేకుండా ల్యాబ్‌లోనే శిశువులను అభివృద్ధి చేస్తున్నారు. దీని వల్ల పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా ఉత్పత్తి అవుతారు. అలాగే సహజంగా పిల్లలు కలగని జంటలకు ఈ పరిశోధన పెద్ద వరమే. కానీ కొంతమంది మాత్రం ఇలా ల్యాబ్ లలో పిల్లలు పుట్టే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు.
స్త్రీపురుషులు లేకుండా ఎలా?
జపాన్‌లోని క్యుషు విశ్వవిద్యాలయంలో ఈ పరిశోధన సాగుతోంది. మానవ కణాల నుంచి అండాలు, స్పెర్మ్ లను భారీగా ఉత్పత్తి చేసి వాటిని సంగమించేలా చేసి పిండాలను అభివృద్ధి చేయాలన్నది పరిశోధకుల ప్రణాళిక. ఈ అధ్యయనం తాలూకు వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ప్రస్తుతం ఎలుకలపై ఈ ప్రయోగం సాగుతోంది. మగ ఎలుకల చర్మంలోని కణాలను మూలకణాలుగా మార్చే పద్ధతిని అనుసరిస్తున్నారు. మగ ఎలుకల మూల కణాలను, ఆడకణాలుగా మార్చే ఔషధంతో అండాలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని ఫలదీకరణం చేయిస్తున్నారు. ఎలుకలలో ఈ ప్రయోగం విజయవంతం అయితే మనుషులకు కూడా అదే తీరుగా వర్తిస్తుంది. ఇప్పటికే 630 పిండాలను అలా తయారు చేశారు. అయితే వాటిలో ఏడు మాత్రమే విజయవంతం అయ్యాయి. ఆ ఏడు ఎలుక పిల్లలుగా మారి ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. కాకపోతే సక్సెస్ రేటు చాలా తక్కువగానే ఉంది. 630 పిండాలకు ఏడు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ రేటును పెంచేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. 2028 కల్లా ఈ ప్రయోగం విజయవంతం చేసి మానవ శిశువులను పుట్టించే స్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.