వేసవిలో జీన్స్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు.
Tight Jeans: డెనిమ్ (Denim) ఫ్యాబ్రిక్కు అభిమానులు ఎక్కువ. డెనిమ్ జీన్స్ (Denim Jeans) ఇట్టే అమ్ముడుపోతాయి. ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మందంగా ఉంటుంది. ఎక్కువసార్లు ఉతకాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఈ డెనిమ్ జీన్స్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. ప్రపంచంలో దాదాపు 90 శాతం యువత ఇష్టపడే జీన్స్ ఇవే. అయితే వేసవిలో (Summer) మాత్రం ఈ జీన్స్ వేసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు దీనివల్ల వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఈ జీన్స్ వేడిని గ్రహిస్తుంది. ఆ వేడి జీన్స్ నుండి చర్మం లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే దాని గుండా గాలి కూడా లోపలికి చొరబడే అవకాశం లేదు. దీనివల్ల చర్మానికి చెమట పట్టినా కూడా జీన్స్ వేసుకున్న చోట ఆ చెమట ఆరదు. గాలి తగలదు. చివరికి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు, అలర్జీలకు, దద్దుర్లకు కారణం అవుతుంది. కాబట్టి ఎండలు మండేటప్పుడు జీన్స్ వేసుకోకుండా వదులుగా ఉండే వస్త్రాలు వేసుకోవడం మంచిది. ఇలా దుస్తుల వల్ల వచ్చే సమస్యను ‘ టెక్స్ టైల్ డెర్మటైటిస్’ అంటారు. ఇది ఎక్కువగా ఎగువ తొడ భాగంలో వస్తుంది. చర్మం ఎరుపుగా మారుతుంది. పొలుసుల్లా రాలిపోవడం మొదలవుతుంది. వేసవిలోనే అధికంగా ఈ సమస్య వస్తుంది.
జీన్స్ వేసుకుంటే చాలామందికి కంఫర్ట్ గా ఉంటుంది, కానీ అవి వేసవిలో మాత్రం చర్మ అనారోగ్యానికి కారణం అవుతాయి. అందుకే వేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆడవారు జీన్స్ కు దూరంగా ఉండాలి. జననేంద్రియ ప్రాంతంలో గాలి తగలక చెమట పట్టి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. అక్కడ ఫంగస్ ప్రారంభమైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. కాబట్టి జీన్స్ కొన్ని రోజులు వేసుకోకపోతేనే మంచిది. టైట్ జీన్స్ వేసుకుంటే తొడల్లో రక్తప్రసరణ కూడా ఆగి పాదాలు ఉబ్బినట్టు అవుతాయి.
మహిళలు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల గర్భాశయ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి టైట్ జీన్స్ కాకుండా వదులుగా ఉండే జీన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని వేసుకుంటే ఉత్తమం. అందం కన్నా ముందు ఆరోగ్యం. కాబట్టి స్టైల్ కోసం చూడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. టైట్ జీన్స్ కు గుడ్ బై చెప్పండి. అవి చూడడానికి అందంగా కనిపించవచ్చు కానీ ఆరోగ్యపరంగా చాలా నష్టం కలిగిస్తాయి.