చాలామందికి హైబీపీ రీడింగ్స్ తెలియవు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
High BP: ప్రపంచంలో అత్యధిక శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో హైబీపీ (High BP). దీన్నే అధిక రక్తపోటు (High blood pressure), హైపర్ టెన్షన్ (Hyper Tention) అని అంటారు. ఎంతోమందికి ఎంత రీడింగ్ దాటితే దానిని హైబీపీ వచ్చినట్టు లెక్కిస్తారో కూడా తెలియదు. అందుకే రక్తపోటు (Blood Pressure) విషయంలో కొంత అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి రక్త పోటు 120/80 ఉంటుంది. అంటే సిస్టోలిక్ ప్రెషర్ 90 నుంచి 120 ఉండవచ్చు. ఇక డయాస్టోలిక్ ప్రెషర్ 60 నుంచి 80 వరకు ఉండవచ్చు. అయితే సిస్టోలిక్ ప్రెషర్ 120 నుంచి 130 మధ్య ఉంటే ప్రీ హైబీపీగా చెప్పుకోవాలి. అప్పుడు జాగ్రత్త పడితే హైబీపీగా మారకుండా ముందే అడ్డుకోవచ్చు. సిస్టోలిక్ ప్రెషర్ 140 దాటిందంటే అధిక రక్తపోటు వచ్చినట్టే. ఎవరి రక్తపోటు అయినా 140/90 దాటి ఉంటే వైద్యులను కలిసి మందులు వాడాల్సిందే. ఇది నరాల వ్యవస్థ పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే గుండెకు ప్రమాదం. అలాగే మూత్రపిండాలు, మెదడు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. శరీర బరువు అధికంగా ఉండే వారిలో హైబీపీ త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి బరువును కూడా తగ్గించుకోవాలి. ఆహార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో కొన్ని ఆహారాలను కచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలి.
వెల్లుల్లి
కూరల్లో ప్రతిరోజు వెల్లుల్లి వేసుకొని తినండి. దీనిలో యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. నైట్రిక్ ఆక్సైడ్ కూడా దీని వల్ల శరీరంలో పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా వెల్లుల్లి కాపాడుతుంది.
అరటి పండు
హై బీపీ ఉన్నవారు రోజూ అరటిపండును తినాలి. దీనిలో ఉండే పొటాషియం శరీరంలోని సోడియాన్ని అడ్డుకుంటుంది. శరీరంపై అది ఎలాంటి చెడు ప్రభావాలను చూపించనివ్వదు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఒక అరటిపండును తినడం మంచిది.
టమాట
తక్కువ ధరకే టమాటాలు వస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ కూరల్లో వేసుకోవడం మంచిది. ఇందులో ఉండే లైకోపీన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆకుకూరలు
ఆకుకూరలను అందరూ తినాల్సిందే. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు తింటే అందులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పాలకూర, తోటకూర, క్యాబేజీ బచ్చల కూర, కాలె, కొత్తిమీర వంటివి రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
బ్లూబెర్రీలు
ఈ పండ్లు మనకు తక్కువగానే పండుతాయి. కానీ సూపర్ మార్కెట్లలో మాత్రం ఇవి లభిస్తాయి. అప్పుడప్పుడు వీటిని కొని తినడం మంచిది. వీటిలో ఆంథోసైనిన్స్ అని పిలిచే ఫ్లావనాయిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.