Telugu movies and web series:థియేటర్లలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్నాయి. మరి కొన్ని డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.
Telugu movies and web series:థియేటర్లలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్నాయి. మరి కొన్ని డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. అయినా సరే కొత్త సినిమాల దండయాత్ర బాక్సాఫీస్ వద్ద ఆగడం లేదు. అయితే ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు చాలా తక్కువే.. కానీ ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు, సిరీస్‌లు మాత్రం ఎక్కువే ఉన్నాయి. అవేంటీ?..వాటి వెనకున్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీతో..
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `అన్నీ మంచి శకునములే`. నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న సంతోష్ శోభన్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. వేసవిలో అమ్మమ్మ ఇంటికి వేసవిలో వెళ్లి పది రోజులు గడిపి వస్తే ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. రెండు కుటుంబాల మధ్య సాగే ఓ అందమైన కథగా ఈ చిత్రాన్ని దర్శకురాలు నందినిరెడ్డి రూపొందించారు.
ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో..
పిచ్చైక్కారన్ తెలుగులో `బిచ్చగాడు`గా విడుదలై సంచలనం సృష్టించింది. 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ `బిచ్చగాడు 2`. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన మే 19న రిలీజ్ అవుతోంది. సినిమా షూటింగ్ లో చావుదాకా వెళ్లి వచ్చిన హీరో విజయ్ ఆంటోని కెరీర్‌కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. బిచ్చగాడు మూవీని మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిస్తే తాజా చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించారు. రెండు కోణాల్లో సాగే పాత్రలో విజయ్ ఆంటోని నటించారని ప్రచార చిత్రాల్లో తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో విజయ్ ఆంటోని ద్విపాత్రాభినయం చేశారని, యాక్షన్ నేపథ్యంలో సాగే సిస్టర్ సెంటిమెంట్ డ్రామా ఇది.
యాక్షన్ ప్రియుల కోసం..
ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న యాక్షన్ సిరీస్ `ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్`. ఈ సిరీస్ సినిమాలకు, ఇందులో నటించిన విన్ డీజిల్ కు అంతకు మించిన స్థాయిలో అభిమానులున్నారు. `ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్` సిరీస్ చిత్రాల్లో భాగంగా వస్తున్న లేటెస్ట్ సిరీస్ `ఫాస్ట్ ఎక్స్`. జస్టిన్ లిన్ దర్శకుడు. జాసన్ మొమోవా ప్రతినాయకుడిగా నటించారు. ఇది రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ సిరీస్ ని మే 19న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కార్ రేస్ దృశ్యాలు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాల నేఫథ్యంలో ఆద్యంత ఆసక్తికరంగా ఈ సిరీస్ సాగనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ అంచనాల్ని పెంచేసింది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు సిరీస్‌లు ఇవే..
ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించేనా..
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ `ఏజెంట్`. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించగా, సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయమైంది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని ఇటీవలే పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షోతో డిజాస్టర్ టాక్ని సొతం చేసుకుని షాకిచ్చింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఆకట్టుకోలేని `ఏజెంట్` ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
విరూపాక్షుడు కూడా వచ్చేస్తున్నాడు…
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ `విరూపాక్ష`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు వెర్షన్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ మూవీ తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోమవారం నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించడంతో ఓటీటీ ప్రేక్షకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలతో పాటు మరి కొన్ని సిరీస్‌లు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఆహా ఓటీటీలో కొణిదెల నిహారిక నటించి నిర్మించిన `దెడ్ పిక్సెల్స్` 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్‌లో `అయాలవాషి` (మలయాళం), కథల్ (హిందీ), బయీ అజైబు (ఇంగ్లీష్), మ్యూటెడ్ (ఇంగ్లీష్), నామ్ (సీజన్ 2) మే 1న, మిగతా సిరీస్‌లు మే 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. సోనీలివ్‌లో `కడిన కదోరమీ అంద కదహం` (మలయాళం), మే 19న, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మే 18న స్ట్రీమింగ్ కానున్నాయి.