Chiranjeevi: అది చిరంజీవి అంటే.. రూ. 45 లక్షలు సాయం
Tamil Actor Ponnambalam Opens Up About The Great Help Of Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఆయన సినిమాలు.. ప్రజలకు ఆయన చేసే సేవ.. అది మాములు విషయం కాదు. అందరికి తెలిసి చిరు చేసిన సాయాలు కొన్ని అయితే.. ఎవరికి తెలియనివి లెక్కలేనన్ని. ఇండస్ట్రీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు అని చిరుకు తెలిస్తే చాలు నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందిస్తాడు. ఇలా ఎంతోమందికి ఎన్నోసార్లు ఆయన చేయి అందించాడు. ఇక చిరంజీవి గారి వలనే తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని కోలీవుడ్ నటుడు పొన్నంబలం చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, తమిళ్ సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చిరు చేసిన సాయం గురించి చెప్పుకొచ్చాడు.
“రెండేళ్ల క్రితం పొన్నంబలం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాను. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆర్థిక సాయం కోసం ఇండస్ట్రీలో ఉన్నవారండి సాయం కోరాను. చాలామంది నాకు హెల్ప్ చేశారు. అందులో చిరంజీవి అన్న ఒకరు. అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి అని ఒక్క మెసేజ్ పెట్టాను. అంతే.. పది నిమిషాల తర్వాత ఆయనే నాకు ఫోన్ చేసి కిడ్నీ సమస్యనా.. కంగారు పడకు ఈ అన్నయ ఉన్నాడుగా.. హైదరాబాద్ వచ్చేస్తావా అని అడిగారు. రాలేను అన్నయ్య అని చెప్పగానే.. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అది చిరంజీవి అంటే అని కామెంట్స్ చేస్తున్నారు.