రామ్ చరణ్ బర్త్ డే వేళ.. ఫ్యాన్స్ కు గీతా ఆర్ట్స్ షాక్!
క్రేజీ స్టార్ల కెరీర్ లని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీస్ ని వారి పుట్టిన రోజుల సందర్భంగా రీ మాస్టర్ చేసి చాలా వరకు రీ రిలీజ్ లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ `పోకిరి`తో ఈ సంప్రదాయానికి తెర లేపారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన `జల్సా` మూవీని విడుదల చేయడం, అది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ అనూహ్యంగా వసూళ్లని రాబట్టడంతో ఈ రీ రిలీజ్ ల క్రేజ్ మరింతగా పెరిగింది.
దీన్ని అవకాశంగా తీసుకుని కొంత మంది ఫ్లాప్ సినిమాలని కూడా రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న న్యూస్ వినిపిస్తోంది. దీంతో రీ రిలీజ్ లు జనరల్ ఆడియన్స్ తో పాటు అభిమానుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇదిలా వుంటే మార్చి 27న స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చరణ్ కు ఆయన కెరీర్ లో హీరోగా తిరుగులేని విజయాన్ని అందించిన ఇండస్ట్రీ హిట్ `మగధీర` మూవీని రీ మాస్టర్ చేసి మార్చి 27న గీతా ఆర్ట్స్ వారు రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
మరో తొమ్మిది రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జరగనుండటంతో అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం భారీగా ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు. `ఆర్ ఆర్ ఆర్` పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత జరగనున్న చరణ్ పుట్టిన రోజు వేడుకలపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసున్నారు. అభిమానులు అంతా సంబరాల్లో మురిగితేలుతున్న వేళ గీతా ఆర్ట్స్ సంస్థ మెగా అభిమానులకు షాకిచ్చింది.
చరణ్ పుట్టిన రోజున ప్రత్యేకంగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన `మగధీర` మూవీని రిలీజ్ చేయడం లేదని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నామని, మరో మంచి సందర్భంలో తప్పకుండా సినిమాని విడుదల చేస్తామంటూ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇక ఆస్కార్ అవార్డ్ వేడుకల్లో పాల్గొనడానికి `ఆర్ ఆర్ ఆర్` టీమ్ తో కలిసి అమెరికా వెళ్లిన రామ్ చరణ్ ఈ శుక్రవారం హైదరాబాద్ కు తిరిగొచ్చారు. తనకంటే ముందే ఎన్టీఆర్, రాజమౌళి బృందం హైదరాబాద్ చేరుకున్నారు. త్వరలో ఇండస్ట్రీ వర్గాలు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ని ప్రత్యేకంగా అభినందించడానికి ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. దీని కోసం ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయనున్నారనే విషయాల్ని ఇండస్ట్రీ వర్గాలు త్వరలోనే వెల్లడించనున్నాయి. ఇదిలా వుంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC 15లో నటిస్తున్నారు.