Rajinikanth Last Movie: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `జైలర్`(jailer). సన్ పిర్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ (Kalanithi Maran)అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Rajinikanth Last Movie: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ `జైలర్`(jailer). సన్ పిర్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ (Kalanithi Maran)అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. `బీస్ట్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక క్యారెక్టర్లో నటిస్తున్నారు. `నరసింహా` వంటి సంచలన మూవీ తరువాత రజినీతో కలిసి రమ్యకృష్ణ నటిస్తున్న సినిమా ఇది. తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, మిర్నామీనన్, జాకీష్రాఫ్, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
పవర్ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్నఈ మూవీని ఆగస్లు 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రజినీ నటిస్తున్న 169వ సినిమా ఇది. 170వ ప్రాజెక్ట్‌ని `జై భీమ్` ఫేమ్ టి.ఝి.జ్ఞానవేళ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని తెరపైకి తీసుకురానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పవర్ ఫుల్ కాప్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది. యధార్థ సంఘటనల ఆధారంగా సోషల్ మెస్సేజ్ నేపథ్యంలో టి.జి. జ్ఞానవేల్ రాజా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే రజినీకాంత్ 171వ ప్రాజెక్ట్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
`బాబా` రిలీజ్ తరువాత..
గతంలోనూ రజినీ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. 20 ఏళ్ల క్రితం సురేష్ కృష్ఱ రూపొందించిన `బాబా` విడుదలైంది. భారీ అంచనాల మధ్య రజినీ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది. ఈ సినిమా ఫలితంతో షాకైన రజినీ సినిమాకు ముగింపు పలకాలనుకున్నారు. అధికారికంగా ప్రకటన కూడా చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అయితే అభిమానుల ఒత్తడి మేరకు ఆ ఆలోచనను విరమించుకున్నారు. కానీ తాజాగా రజినీకాంత్ సినిమాకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీపై దర్శకుడు మిస్కిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖైదీ, విక్రమ్ సినిమాలతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ 171వ సినిమా చేయబోతున్నారని, ఇదే ఆయన చివరి సినిమా అని, దీని తరువాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వెల్లడించి షాకిచ్చారు. మిస్కిన్ మాట్లాడుతూ `సూపర్ స్టార్ కెరీర్లో లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న మూవీ 171వది. 5 దశాబ్దాల కెరీర్ ఈ సినిమాతో ముగియనుందని తెలిపారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం రజినీ స్వయంగా లోకేష్ కనగరాజ్‌ని కలిశారని, తనతో సినిమా చేయమని కోరారన్నారు. ఇదే ఆయన యాభై ఏళ్ల సినీ కెరీర్లో చివరి సినిమా అని చెప్పడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
`కొశ్చడయాన్` టైమ్‌లోనూ..
2014లో సౌందర్య రజనీకాంత్ రూపొందించిన యానిమేటెడ్ పీరియాడిక్ డ్రామా `కొశ్చడయాన్`. కె.ఎస్. రవికుమార్ కథ అందించిన ఈ మూవీలో దీపిక పదుకునే హీరోయిన్గా నటించింది. అవాతార్కు వాడిన మోషన్ క్యాప్షర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాని రూపొందించారు. అయితే ఆ స్థాయి ఔట్ పుట్ రాకపోవడంతో చివరికి కొచ్చడాయాన్ యానిమేషన్ ఫిల్మ్‌గా మారింది. దీంతో సౌందర్య రజినీకాంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రజినీ కాంత్‌తో చేయాల్సిన సినిమా ఇది కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా టైమ్‌లో రజనీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
ఆరోగ్యం క్షీణించడంతో ఆయనని సింగపూర్ కు తరలించి ప్రత్యేక చికిత్స చేయించారు. ఆ టైమ్‌లోనూ రజనీ ఇకపై సినిమాలు చేయడం కష్టమనే వదంతులు వినిపించాయి. దీనిపై రజినీకాంత్ కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తిరుగికోలుకున్న `లింగ` మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. `కబాలి, కాల వంటి వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం 169వ ప్రాజెక్ట్‌గా `జైలర్` మూవీలో నటిస్తున్న రజినీ `లాల్ సలామ్`లో గెస్ట్ క్యారెక్ట్ చేస్తూనే మరో రెండు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టారు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ ప్రస్తుతం విజయ్‌తో `లియో` మూవీని తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్‌తో 171వ ప్రాజెక్ట్ చేయనున్నారని, ఇదే ఆయన చివరి సినిమా అని ప్రచారం జరగుతోంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే స్వయంగా రజినీ స్పందించాల్సిందే.