Bunny Vasu: నిర్మాత బన్నీ వాసుకి తప్పిన ప్రమాదం..
Producer Bunny Vasu Escapes From Godavari Floods: టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. బన్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అనేక చిత్రాలు నిర్మించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇద్దరికీ బన్నీ చాలా క్లోజ్ గా ఉంటారు. అలాగే బన్నీ వాసు తరచుగా జనసేన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొంటూ ఉంటారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో బన్నీవాసు, జనసైనికులతో పాటు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. బన్నీ వాసు తన వంతు కర్తవ్యంగా వరద లో చిక్కుకున్న వారిని ముఖ్యం గా ఒక గర్భిణీ ని రక్షించే సమయం లో పడవ ప్రమాదానికి గురి అయింది.
బాడవ గ్రామంలో వరదలో చిక్కుకున్న వారిని పడవలో ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో పడవ నీటిలో కొట్టుకుపోసాగింది. ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగింది. దీంతో పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ విరిగి పోయింది. అయితే కొంతమంది నీళ్లలో పడిపోగా పడవ నడిపే వ్యక్తి వారందరినీ రక్షించారు. ఆ సమయంలో పడవలో సినీ నిర్మాత బన్నీవాసు, గర్భిణీ సహా మరికొందరు జనసేన నాయకులు ఉన్నారు. వారు సురక్షితంగా బయట పడడంతో పెనుప్రమాదం తప్పింది. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని, ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని బన్నీ వాసు ప్రభుత్వాన్ని కోరారు.