100cr Movies:దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కంటెంట్ బాగుంటే సందడి చేస్తున్నాయి.
100cr Movies:దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కంటెంట్ బాగుంటే సందడి చేస్తున్నాయి. రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్నాయి. దీంతో చిన్న హీరోలకి సైతం మార్కెట్ అమాంతంగా పెరిగింది..మొన్న నిఖిల్ కార్తికేయ 2 రూ.100 కోట్లు వసూలు చేస్తే ఇప్పుడు సాయి ధరమ్‌తేజ్ విరూపాక్ష కూడా రూ.100 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కంటెంట్ ఉంటే ఇమేజ్, స్టార్ కాస్ట్‌తో సంబంధం లేకుండా రూ.100 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు ఆనవాయితీగా మారుతోంది. దీనిపై అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.
కృష్ణతత్వం బోధపడింది..
ఈ మధ్య ఏ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఊహించిన సినిమా డిజాస్టర్ అనిపించుకుంటే ఈ మూవీకి అంత సీన్ లేదని భావించిన సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. యంగ్ హీరో నిఖిల్ నటించిన మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కృష్ణతత్వం నేపథ్యంలో రూపొందింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైనే రాబట్టి ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ లో హేమా హేమీలు నటించిన భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడి చేతులెత్తేస్తుంటే అక్కడ 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది. హీరో నిఖిల్ కెరీర్‌ని సరికొత్త మలుపు తిప్పి కొత్త కొత్త ప్రయోగాలు చేసే ధైర్యాన్నిచ్చింది.
పవ్వగొట్టి మరీ వంద కొట్టి..
నేచురల్ స్టార్‌గా పేరున్న నాని ఇంత వరకు వంద కోట్ల క్లబ్లో చేరలేదు. స్టార్ హీరోల్లో చాలా వరకు వంద కోట్ల మార్కుని దాటుతున్నా ఆ టార్గెట్‌ని రీచ్ కాలేక సరైన మాస్ బొమ్మ కోసం నాని ఎదురుచూశాడు. ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చింది. అదే `దసరా`. పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన సినిమా ఇది. దోస్త్ కోసం ప్రేమించిన వెన్నెలను త్యాగం చేసి వాళ్లలో ఆనందాన్ని వెతుక్కుంటూ తనలో తానే మదనపడే ఓ యువకుడి కథ ఇది. పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన `దసరా` నాని కెరీర్లోనే భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
విడుదలైన వారం రోజుల్లోనూ రూ.100 కోట్ల మార్కుని దాటి పాన్ ఇండియా మూవీగా విడుదలై హీరోగా నానిని వంద కోట్ల క్లబ్లో చేర్చింది. మాసీవ్ క్యారెక్టర్లో నాని నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ క్యారెక్టర్ లో కనిపించింది. నటన పరంగా నాని, కీర్తి సురేష్‌లకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇండస్ట్రీలో నిర్మాతలు వరుగా అడ్వాన్స్‌లు ఇప్పించేలా చేసింది.
హిట్టు కోసం హారర్ స్టోరీ వెంటపడితే..
బైక్ యాక్సిడెంట్ తరువాత చేయాలా వద్దా.. నా వల్ల అవుతుందా? కాదా? .. డైలాగ్ కూడా చెప్పలేని స్టేజ్‌లో సాయి ధరమ్ తేజ్ నటించిన సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ `విరూపాక్ష`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని రూపొందించాడు. సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తూనే స్క్రీన్ ప్లే అందించారు. గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ముందు తెలుగుతో పాటు ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా ముందు తెలుగులో విడుదల చేస్తే ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని భారీ వసూళ్లని రాబట్టి ఔరా అనిపించింది.
కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ తొలి సారి హారర్ స్టోరీతో చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహకందని విధంగా రూ.100 కోట్లు రాబట్టింది. దీంతో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా వంద కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాతో అతని మార్కెట్ స్థాయి కూడా భారీగా పెరిగింది.
స్టార్ హీరో లేకుండానే…
స్టార్స్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకొస్తారు.. కాసుల వర్షం కురిపిస్తారనే కాలం మారింది. స్టార్ హీరో లకు కాకుండా కంటెంట్‌కు మాత్రమే ప్రేక్షకులు ఈ రోజుల్లో ప్రధాన్యత ఇస్తున్నారు. సినిమా నచ్చితే బ్రహ్మరథం పట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది చివర్లో విడుదలైన కన్నడ మూవీ `కాంతార` నిరూపించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఇదే తరహాలో అదాశర్మ నటించిన `ది కేరళ స్టోరీ` దేవ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాజకీయంగానూ దుమారాన్ని రేపిన ఈ సినిమా మూడవ వారంలోకి ఎంటర్ అవ్వకుండానే రూ. 150 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్ని అవాక్కయ్యేలా చేసింది. కేరళలో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా హిందూ మహిళలని ట్రాప్ చేసి ఐసిస్‌లోకి బలవంతంగా మారుస్తున్న తీరుని యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ ఈ సినిమాని రూపొందించారు. బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. తమిళనాడు, బెంగాళ్ వంటి రాష్ట్రాల్లో బ్యాన్ చేసినా కూడా ఈ స్థాయిలో వసూళ్లని రాబట్టడం విశేషంగా చెబుతున్నారు.
మోహన్ లాల్, మమ్ముట్టిలకు మాత్రమే…
మలయాళంలో వంద కోట్ల సినిమా అంటే మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలే. కానీ ఇప్పడు అక్కడ చిన్న హీరో కూడా ఈ ఫీట్ ని అలవోకగా దాటగలడని నిరూపించిందో సినిమా. అదే `2018`. మే5న విడుదలైంది. మిన్నాల్ మురళి ఫేమ్ టివినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాని 2018 కేరళ వరదల నేపథ్యంలో దర్శకుడు జూడ్ ఆంటోని జోసెఫ్ రూపొందించారు. టివినో థామస్ అక్కడ చిన్న హీరో. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు మల్లువుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం పదకొండ రోజుల్లోనూ రూ. 100 కోట్ల గ్రాస్‌ని రాబట్టి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మండే ఎండల్లోనూ కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు జైకొడతారని 2018 మూవీ మరోసారి నిరూపించింది. త్వరలో ఈ చిత్రాన్ని బన్నీవాసు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడుదలైన పది రోజుల్లో 100 కోట్లు రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు అవాక్కవుతున్నాయి. ఈ వరుస చూస్తుంటే ఇకపై కంటెంట్ ఉన్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టడం కామన్ అవుతుందేమో చూడాలి అనే చర్చ మొదలైంది.