Malli Pelli Movie Review:నటీనటులు: నరేష్, పవిత్ర లోకేష్, వనితా విజయ్ కుమార్,శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ తదితరులు నటించారు.
Malli Pelli Movie Review:నటీనటులు: నరేష్, పవిత్ర లోకేష్, వనితా విజయ్ కుమార్,శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ తదితరులు నటించారు.
సంగీతం:సురేష్ బెబ్బులి, అరుల్ దేవ్,
ఛాయాగ్రహణం:బాల్ రెడ్డి
ఎడిటింగ్:జునైద్
నిర్మాత:నరేష్
రచన, దర్శకత్వం:ఎం.ఎస్.రాజు
నరేష్, పవిత్ర లొకేష్ల చుట్టూ కొంత కాలంగా ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వీరిద్దరిపై సంచలన ఆరోపణలు చేయడం, దానికి నరేష్ స్పందించడం, ఆ తరువాత ఇద్దరం ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాం.. కానీ పెళ్లి చేసుకోలేదు అంటూ నరేష్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేష్, పవిత్ర కలిసి నటించిన సినిమా `మళ్లీ పెళ్లి`. ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎర్పడ్డాయి. నరేష్, పవిత్రల కథనే సినిమా చేస్తున్నారని ప్రచార చిత్రాలతో స్పష్టం చేసినా నరేష్ మాత్రం అది కాదని చెబుతూ వచ్చారు. కొత్త కథ అన్నారు. మే 26 శుక్రవారం విడుదలైన `మళ్లీ పెళ్లీ` ఎలా ఉంది? ..నరేష్ చెప్పిన కొత్త కథా.. కట్టుకదా? అన్నది తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటీ?:
ప్రముఖ నటుడైన నరేందర్ (నరేష్), సౌమ్య సేతుపతి (వనిత విజయ్ కుమార్) వివాహం చేసుకుంటారు. ఇద్దరికి ఓ బాబు పుడతాడు. ఆ తరువాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వరుస గొడవలతో విసిగిపోయిన నరేందర్ ప్రశాంతత కోసం మనశ్శాంతి కోసపం వెతుకుతున్న క్రమంలో అతని జీవితంలోకి మరో నటి పార్వతి (పవిత్ర లోకేష్) ఎంటరవుతుంది. ఆమె వెనకున్న కథేంటీ?.. తన కోసం నరేందర్ ఏం చేశాడు? ..ఎలా ఇద్దరు ఒక్కటయ్యారు?.. అతని భార్య సౌమ్య సేతుపతి ఏం చేసింది? ఆమె కారణంగా నరేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్నదే అసలు కథ.
నటీనటులు నటన:
నరేష్, పవిత్ర లోకేష్, వనిత విజయ్ కుమార్..ఈ ముగ్గురు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ ముగ్గురు కూడా తమ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోయారు. ఇక నరేష్ ముందు నుంచి ఇది తన లైఫ్ స్టోరీ కాదని చెప్పినా సినిమాలో అదే అసలు కథ అని తేలింది. ఇందులో ఆయన తల్లి విజయనిర్మల పాత్రలో జయసుధ కనిపించగా, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు నటించారు. ఇదే ఆయన చివరి సినిమా. జయసుధ, నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇక పవిత్ర లోకేష్ యుక్త వయసు పాత్రలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల నటించి తనదైన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక పక్కనే ఉంటూ కీలకమైన డైలాగ్‌లు చెబుతూ అన్నపూర్ణమ్మ ఆకట్టుకుంది. `సూపర్ స్టార్ కొడుకు ఈయన కాదు.. బుల్లి సూపర్ స్టార్`.. కన్ను కొట్టడం నేర్పిస్తాడట పక్కు వెళ్లు` అంటూ ఆమెతో చెప్పించిన డైలాగ్‌లు పదే పదే ఇది నరేష్, పవిత్రల కథే అని ప్రేక్షకులకు గుర్తు చేశాయి. రోషన్, రవివర్మ తదితరులు తమ పాత్రల పరిథి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల పని తీరు:
సాంకేతికత పరంగా సినిమా ఉన్నతంగా ఉంది. అయితే ఎం.ఎస్. రాజు కథకుడిగా కంటే దర్శకుడిగానే తన పని తీరుతో ఆకట్టుకున్నారు. ముందు నుంచి ఇది నరేష్, పవిత్రల కథే అని మీడియా నొక్కి మరీ చెబుతున్నా ఆయన కాదు ఇది కొత్త కథ.. మీరే ఏదేదో ఊహించుకుని అదే అనుకుంటున్నారు. మీరొకటి ఫిక్సయ్యారు. అలా అయ్యాక మేము ఏం చెప్పినా మీరు అదే అనుకుంటారు.. అంటూ మీడియానే దబాయించే ప్రయత్నం చేశారు. కానీ తీసింది మాత్రం నరేష్, పవిత్రల వ్యక్తిగత కథే. తెలిసిన కథే కావడంతో ప్రేక్షకులకు కొత్తగా కనిపించలేదు. కానీ అనుకున్న కథని ఎం.ఎస్.రాజు నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకుంది.
ఈ విషయంలో ఆయన కథకుడిగా కంటే దర్శకుడిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. సురేష్ బెబ్బులి, అరుల్ దేవ్ అందించిన సంగీతం, బ్రాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. బాల్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం, జునైద్ ఎడిటింగ్ వంటి వారు మంచి పని తీరుని ప్రదర్శించారు. నిర్మాణంపరంగా సినిమా క్వాలిటీ ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎలా ఉందంటే:
ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగానే ఈ సినిమాలో తెలిసిన కథనే చూపించారు. నరేష్, పవిత్రలు నిజ జీవిత పాత్రల్నే ఇందులో పోషించారు. ఈ ఇద్దరి జీవితాల్లో జరిగిన వ్యక్తిగత విషయాలు తెలియని వారు లేరు. ఎప్పుడైతే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వీరిద్దరి బంధంపై ఆరోపణలు చేస్తూ మీడియాకు ఎక్కడం, కోర్టుని ఆశ్రయించడం చేసిందో అప్పటి నుంచి నరేష్, పవిత్ర నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. ఇలా అందరికి కొంత కాలంగా తెలిసిన కథనే మళ్లీ దానికి సినిమా కలరింగ్ ఇచ్చి మరీ కోట్లు ఖర్చు చేసి సినిమా చేయడం నిజంగా విడ్డూరమే. రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రించాలన్న ఆలోచనలో భాగంగానే నరేష్ ఈ సినిమాకు శ్రీకారం చుట్టినట్టుగా సినిమా ఉంది. సినిమా రిలీజ్‌కు ముందు కూడా తనని కించ పరిచే విధంగా ఇందులో వనిత విజయ్ కుమార్ క్యారెక్టర్ని మలిచారని, సినిమా రిలీజ్‌ని నిలిపి వేయండి అంటూ రమ్య రఘుపతి కోర్టుకు ఎక్కడం తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలకు వెండితెర సాక్ష్యంగా ఈ సినిమా నిలవడం గమనార్హం. ఇక విధంగా చెప్పాలంటే ప్రేక్షకుల్ని మోసం చేయాలనే ఆలోచనతో తమ క్రేజ్‌ని కాసులుగా మలుచుకోవాలని నరేష్ చేసిన చవకబారు డ్రామా `మళ్లీ పెళ్లి` అనక తప్పదు.
పంచ్ లైన్: బయోపిక్ కాదు కానీ బయోపిక్కే
రేటింగ్:2.0/5